
ఛాంఫియన్స్ ట్రోఫీ సెమీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగలనుంది. ఆ జట్టు ఓపెనర్ మాథ్యూ షార్ట్ కీలకమైన సెమీస్ పోరుకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. గ్రూప్ దశలో భాగంగా ఇటీవల ఆప్ఘానిస్తాన్తో జరిగిన మ్యాచులో షార్ట్ గాయపడ్డాడు. వెన్ను నొప్పితో బాధపడుతూనే ఆఫ్ఘాన్‌తో మ్యాచ్ ఆడాడు. గాయం కారణంగా క్రీజ్‌లో చురుగ్గా కదలేకపోయిన ఈ ఓపెనర్.. 15 బంతుల్లో 20 పరుగులు చేసి అజ్మతుల్లా ఒమర్జాయ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.
ఈ మ్యాచ్‌లో గాయం మరింత ముదరడంతో షార్ట్ సెమీస్ పోరుకు దూరం కానున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచులో ఆసీస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. 351 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపులో ఓపెనర్ మాథ్యూ షార్ట్ కీలక పాత్ర పోషించాడు. భారీ లక్ష్య ఛేదనలో 63 రన్స్ చేసి ఆసీస్ గెలుపులో తన వంతు పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే.. గ్రూప్-బీ నుంచి ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీస్ చేరిన విషయం తెలిసిందే.
ఇంగ్లాండ్ పై విజయంతో రెండు పాయింట్లు రాగా.. సౌతాఫ్రికా, ఆప్ఘాన్‌తో జరిగిన మ్యాచులు రద్దు కావడంతో రెండు పాయింట్లు వచ్చాయి. మొత్తం నాలుగు పాయింట్లతో గ్రూప్ బీ నుంచి కంగారులు సెమీస్‌కు చేరుకున్నారు. గ్రూప్ ఏ నుంచి సెమీస్ కు చేరుకున్న భారత్ లేదా న్యూజిలాండ్ తో ఆస్ట్రేలియా సెమీస్ పోరులో తలపడనుంది. ఈ కీలకమైన మ్యాచ్‌కు ఫామ్‌లో ఉన్న ఓపెనర్ మాథ్యూ షార్ట్ దూరం కావడం ఆస్ట్రేలియాకు ఎదురు దెబ్బేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.