ఆస్ట్రేలియా క్రికెటర్, టాస్మానియా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్‌పై వేటు పడింది. మైదానంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకుగానూ అతనిపై క్రికెట్ ఆస్ట్రేలియా రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది.
ఏం జరిగిందంటే..?
ఆస్ట్రేలియా డొమెస్టిక్ వన్డే కప్‌లో భాగంగా సోమవారం విక్టోరియా, టాస్మానియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ టోర్నీలో టాస్మానియా తరపున ఆడుతున్న వేడ్ 25 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఒక బాల్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. బంతి నేరుగా వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్ళగా.. డాట్ బాల్ అయినందుకు అతను ఆగ్రహంతో ఊగిపోయాడు. బ్యాట్‌తో పిచ్‌ను బలంగా కొట్టాడు. ఇది క్రికెట్ ఆస్ట్రేలియాకు ఆగ్రహాన్ని తెప్పించింది.
Also Read :- చరిత్ర సృష్టించిన భారత్.. 41 ఏళ్ల తర్వాత ఈక్వెస్ట్రియన్ విభాగంలో స్వర్ణం
వేడ్ చర్యలను క్రికెట్ ఆస్ట్రేలియా క్రమశిక్షణ కమిటీ తప్పుబట్టింది. క్రికెట్ ఆస్ట్రేలియా కోడ్ ఆర్టికల్ 2.5 ప్రకారం.. మ్యాచ్ జరిగే సమయంలో క్రికెట్ పరికరాలు లేదా దుస్తులు లేదా గ్రౌండ్ పరికరాలు ధ్వంసం చేయడం నిబంధనలు ఉల్లఘించినట్లే అని నిర్ధారించి అతనిపై రెండు మ్యాచ్ ల నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ తప్పును వేడ్ కూడా అంగీకరించటం గమనార్హం.