శ్రీ సింహ కోడూరి, సత్య లీడ్ రోల్స్‌లో రితేష్ రానా దర్శకత్వంలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన చిత్రం ‘మత్తు వదలరా 2’. ఇటీవల విడుదలైన ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘మత్తు వదలరా’కి సీక్వెల్ చేయాలని చెర్రీ గారు ఎప్పటి నుంచో అంటున్నారు. ఆర్గానిక్‌గా మంచి ఐడియా వస్తేనే చేద్దామని ఎదురుచూసి, అలాంటి ఆలోచన రాగానే ఆయనకు చెప్పాను. టీమ్ అందరికీ అది నచ్చింది. మేం ఊహించిన దానికి మించిన స్పందన ప్రేక్షకుల నుంచి రావడం సంతోషంగా ఉంది.
చిరంజీవి గారు, మహేష్ బాబు గారు అప్రిషియేట్ చేయడం ఫుల్ హ్యాపీ. రాజమౌళి గారికి కూడా సినిమా చాలా నచ్చింది. చాలా ఎంజాయ్ చేశారు. సత్య పోషించిన యేసు పాత్రకు ఎక్కువ అప్లాజ్ రావడానికి కారణం శ్రీసింహా పోషించిన బాబు క్యారెక్టర్. బాబు లేకపోతే యేసు పాత్ర అంతగా పండదు. ఇక ఫరియా చాలా బాగా చేసింది. తనను దృష్టిలో ఉంచుకునే ఆ పాత్ర రాశా.
అజయ్ పాత్రను పరిచయం చేయడం కోసం ఆయన నటించిన పాత సినిమాల్లోని సీన్స్ వాడాం. వాటికి ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు. సినిమాలోని ‘స్లేవ్ డ్రగ్’ అనే దానిని ఒక మెటాఫర్‌లా వాడం. మత్తు అనేది చాలా రకాలు. దాన్నుంచి బయటపడటం మంచిదని చెప్పడమే మా ఉద్దేశం. దీనికి తప్పకుండా సీక్వెల్ తీస్తాం. నా తర్వాతి చిత్రం కూడా చెర్రీ గారి నిర్మాణంలోనే ఉంటుంది. దాని తర్వాతే ‘మత్తు వదలరా 3’ ఉంటుంది’ అని చెప్పాడు.