సిటీ అద్భుతంగా మారాలె..హెచ్​సిటీలో భాగంగా రూ. 7,032 కోట్లతో పనులు

సిటీ అద్భుతంగా మారాలె..హెచ్​సిటీలో భాగంగా రూ. 7,032 కోట్లతో పనులు
  • మొదటి దశలో రూ. 2100 కోట్లతో వర్క్స్​ 
  • రోడ్లు, ట్రాఫిక్​ సమస్య, వరద ముంపు తప్పించడమే లక్ష్యం
  •  ఫీల్డ్​లోకి వెళ్లండి: అధికారులకు ఎంఏయూడీ చీఫ్ సెక్రటరీ ఆదేశాలు  

హైదరాబాద్ సిటీ, వెలుగు : హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ ఫార్మేటివ్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్(హెచ్ సిటీ)  పనులతో రోడ్లు, వరద, ట్రాఫిక్​సమస్యకు పరిష్కారం లభించేలా పనులు చేయాలని ఎంఏయూడీ చీఫ్ సెక్రటరీ ఎం దాన కిషోర్ బల్దియా అధికారులకు ఆదేశించారు. ఆదివారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరితి, అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, ఎస్ఈ, ఈఈ, సిటీ ప్లానర్లతో సెక్రటేరియేట్​నుంచి  సచివాలయం నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

హెచ్-సిటీ ప్రాజెక్టుతో నగరానికి ప్రధాన సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు. సిటీ నలువైపులా ఫ్లైఓవర్లు, అండర్ పాస్​లు, ఆర్​యూడీ, ఆర్వోబీలను రూ.7,032  కోట్లతో మూడు దశల్లో  నిర్మిస్తుందన్నారు. మొదటి విడతలో రూ.2100 కోట్లతో పనులు చేస్తున్నామని, వీటిపై శనివారం సీఎం పలు కీలక సూచనలు జారీ చేశారన్నారు. ఒక్కో జోన్ కు అడిషనల్​కమిషనర్ లేదా జోనల్ కమిషనర్ నేతృత్వంలో టీమ్స్​గా ఏర్పడి ఫీల్డ్​కు వెళ్లి పనులను పరిశీలించాలన్నారు. ఏమైనా మార్పులు, చేర్పులు చేయాల్సి ఉంటే సలహాలు, సూచనలు అందజేయాలని ఆదేశించారు.

త్వరలో టెండర్లు పూర్తి చేయండి: కమిషనర్

హెచ్ సిటీలో భాగంగా  చేపట్టనున్న పనులకు సంబంధించి టెండర్లు వేయాలని బల్దియా కమిషనర్ ఇలంబరితి అధికారులకు ఆదేశించారు. ఆదివారం ప్రాజెక్టు సీఈ,  టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించి పనులను పరిశీలించారు. నానల్ నగర్–రేతిబౌలి, ఖాజాగూడ జంక్షన్– ట్రిపుల్ ఐటీ, విప్రో జంక్షన్–డీఎల్ఎఫ్ జంక్షన్​లలో ఫ్లై ఓవర్ల నిర్మాణానికి భూసేకరణ, టెండర్​ పక్రియ వేగంగా పూర్తి చేయాలన్నారు. 

సరోజినీ దేవి కంటి దవాఖాన నుంచి రాడి సన్ బ్లూ ప్లాజా, బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1, చింతల్ బస్తీ మీదుగా ఖైరతాబాద్ వరకు రోడ్డు విస్తరణ చేయాల్సి ఉండగా, ఈ ప్రాంతాలను  కమిషనర్​ పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ గ్రేటర్ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని, హెచ్-సిటీ ద్వారా  రూ. 7,032 కోట్లు మంజూరు చేశారన్నారు. వీటితో 25 పనులు చేయనున్నామన్నారు. ఈ పనులకు టెండర్ ప్రక్రియ పూర్తిచేసి పనులను చేపట్టేందుకు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు.