విద్యాభివృద్ధికి మౌలానా బాటలు : ఎండీ ఉస్మాన్ ఖాన్

భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆయన పూర్తి పేరు సయ్యిద్ అబుల్ కలాం గులాం మొహియుద్దీన్ అహ్మద్ ఆజాద్. తండ్రి ముద్దుగా ఫిరోజ్ బఖ్త్ అని పిలుచుకునేవారు. అబుల్ కలాం అనేది బిరుదు. కలం పేరు ఆజాద్.1888 నవంబర్ 11న సౌదీ అరేబియాలోని మక్కాలో ఒక సంపన్న ధార్మిక కుటుంబంలో జన్మించారు. ఆలియా బేగం, మౌలానా ఖైరుద్దీన్ అహ్మద్ ఆయన తల్లిదండ్రులు. ఆజాద్ గొప్పస్వాతంత్ర్య సమర యోధుడు. తత్వవేత్త, సాహితీవేత్త, విద్యావేత్త, రాజకీయ వేత్త, ఆధునిక భారత విద్యావ్యవస్థ నిర్మాత. అనేక భాషల్లో ఆయన నిష్ణాతుడు.1940 నుంచి1946 వరకు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఉన్నారు. అదీ 35 ఏండ్ల అతి పిన్న వయసులోనే. 1947 నుంచి 1952 వరకు విద్యాశాఖమంత్రిగా, 1952 నుంచి 1958 వరకు విద్యా, ప్రకృతి వనరులు, శాస్త్ర సాంకేతిక మంత్రిగా, 1956 లో యునెస్కో అధ్యక్షుడిగా పనిచేసిన ఆజాద్ విద్యాభివృద్ధికి తీవ్రంగా కృషిచేశారు. విద్యా రంగంలో శాస్త్ర, సాంకేతికతను పెంపొందించడం కోసం పాటుపడ్డారు.1951లో ఖరగ్‌‌పూర్‌‌ ఇన్​స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ హయ్యర్‌‌ టెక్నాలజీని స్థాపించిన ఘనత మౌలానా ఆజాద్ దే. ఆయన గౌరవార్థం దేశంలో అనేక విద్యాసంస్థలకు మౌలానా పేరు పెట్టారు. 

హిందూ ముస్లింల ఐక్యతకు కృషి

హిందూ -ముస్లింల ఐక్యతను పెంపొందించడమే ధ్యేయంగా ‘అల్ హిలాల్‌‌’ పత్రికను స్థాపించారు. అప్పటి బ్రిటీష్‌‌ ప్రభుత్వం ఆ పత్రికను నిషేధించడంతో ‘అల్ బలాగ్‌‌’ పేరుతో మరో పత్రికను ప్రారంభించారు. ఆయన మొట్టమొదట రాసిన గజల్ ‘అర్మగానె ఫర్ఖ్’ పత్రికలో ప్రచురితమైంది. తరువాత లక్నో నుంచి వెలువడే‘ఖుదంగె నజర్’,‘పయామెయార్’ పత్రికల్లో ఆయన కవిత్వం క్రమం తప్పకుండా ప్రచురితమయ్యేది. ఆయన‘నైరంగ్ ఆలం’ పేరుతో ఓ సాహిత్య పత్రికను కూడా ప్రారంభించారు. తర్జుమానుల్ ఖురాన్ పేరుతో పవిత్ర ఖురాన్ గ్రంథానికి వ్యాఖ్యానం రాశారు. భారత్, పాకిస్తాన్ విభజనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. జిన్నాతో విభేదించారు. మౌలానా ఆజాద్ మరణానంతరం 1992 లో భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను అందించి గౌరవించింది. లౌకికవాదానికి, జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన మౌలానా అబుల్ కలాం ఆజాద్1958 ఫిబ్రవరి 22 వ తేదీన డిల్లీలో తుదిశ్వాస విడిచారు. మౌలానా గౌరవార్థం ఆయన పుట్టిన రోజును జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకోవాలని 2008, సెప్టెంబరు 11న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అదే రోజు జాతీయ మైనారిటీ సంక్షేమ దినోత్సవంగానూ జరుపుకుంటున్నారు. దేశంలో ప్రతి పౌరుడికి విద్యనందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని ఆయన బలంగా నమ్మేవారు. కానీ గత మూడు దశాబ్దాలలో విద్యా రంగంలో ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ చోటు చేసుకుని, విద్య వ్యాపారం కొనసాగుతున్నది. ప్రైవేటు రంగాల్లో స్థాపించిన విద్యాలయాలపై సరైన నియంత్రణ లేకపోవడంతో నాణ్యత లోపిస్తున్నది. విద్య మార్కెట్‌‌ వస్తువుగా మారింది. మౌలానా ఆకాంక్షలకు భిన్నంగా విద్యా రంగంలో పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఓట్ల కోసం పథకాలు పెడుతూ.. విద్యను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వాల్లో ఇకనైనా మార్పు రావాలి. ప్రతి పేద పిల్లలకు ఉచిత నాణ్యమైన విద్యను అందించడమే మౌలానాకు మనం అర్పించే నిజమైన నివాళి!.

జాతీయోద్యమంలో జైలుకు వెళ్లి..

1921లో సహాయ నిరాకరణ, 1930లో శాసనోల్లంఘన, 1942 లో క్విట్‌‌ ఇండియా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. పది సంవత్సరాలకు పైగా జైలు జీవితం అనుభవించారు.1890లో ఆయన కుటుంబం కలకత్తా వచ్చి స్థిరపడింది. ప్రాథమిక విద్య ఇంటి దగ్గరే నేర్చుకున్నారు. పన్నెండేళ్ల వయసులోనే ఆయనకు ప్రత్యేకంగా రీడింగ్ రూమ్, సొంత లైబ్రరీ ఉండేవి. మొదట పార్శీ, అరబీ విద్యలు ఔపోసన పట్టారు. తరువాత ఫ్రాన్స్, ఇంగ్లీషు గ్రంథాల విస్తృత అధ్యయనం  ప్రారంభించారు. మౌలానా విభిన్నరంగాల్లో అవగాహన, ఆసక్తి, నైపుణ్యం కలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి. పండిట్‌‌  నెహ్రూ మౌలానా రాజకీయ, సామాజిక పరిణతి గురించి గొప్పగా ప్రశంసించారు. 

- ఎండీ ఉస్మాన్ ఖాన్, సీనియర్ జర్నలిస్టు