మ్యాన్ హోల్ పడిన మౌనిక.. అన్నను కాపాడబోయి...ఏం జరిగిందంటే

మ్యాన్ హోల్ చిన్నారిని మింగేసింది. సికింద్రాబాద్ కళాసిగూడలో మ్యాన్ హోల్ పడి ముక్కపచ్చలారని బాలిక మృతి చెందింది. పాల ప్యాకెట్ కోసం అన్నతో కలిసి బయటకు వచ్చిన మౌనిక నీటిలో కొట్టుకుపోయింది. అసలు మౌనిక ఎలా చనిపోయింది. 

ఏం జరిగిందంటే..

ఏప్రిల్ 29వ తేదీ తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్ లో వర్షం దంచికొట్టింది. దీంతో రోడ్లు నదులను తలపించాయి. మ్యాన్ హోళ్లు పొంగిపొర్లాయి. కొద్దిసేపు వర్షం ఆగడంతో..అప్పుడే లేచిన మౌనిక (6) తన అన్నతో కలిసి కిరాణా షాపుకు పాలపాకెట్ కోసం బయటకు వచ్చింది. ఈ సమయంలో రోడ్డుపై వర్షపు నీరు పారుతోంది. ఈ నీరంతా అక్కడే తెరిచిఉన్న నాలాలోకి ప్రవహిస్తోంది. అయితే నాలా తెరిచి ఉందని మౌనిక..ఆమె అన్న గమనించలేదు. ఓ  గోడను పట్టుకుంటూ అన్న చెల్లెలు కిరాణా షాపు దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో మౌనిక అన్న కాలు జారి మ్యాన్ హోల్ దగ్గర పడ్డాడు. అన్న పడిపోవడంతో అతన్ని కాపాడటానికి మౌనిక ప్రయత్నించి నాలాలో పడిపోయింది. వర్షపు నీరు వేగంగా ప్రవహిస్తుండటంతో ఆ ధాటికి మౌనిక కొట్టుకుపోయింది. 

 
నాలుగు రోజులుగా పని..

మౌనిక పడిన నాలా దగ్గర గత నాలుగు రోజులుగా పనులు జరుగుతున్నాయి. అందుకే నాలాను తెరిచారు. కానీ అక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టడం మరిచారు. ఇదే మౌనిక పాలిట శాపమైంది. నాలా తెరిచారని గమనించలేకపోయింది మౌనిక. అన్నను కాపాడబోయి తన చనిపోయింది. 
జీహెచ్ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యంతోనే మౌనిక మృతి చెందిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.