- నాచుపట్టి శిథిలావస్థలో మావల ఎమ్మార్వో కార్యాలయం
- బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న మావల తహసీల్దార్కార్యాలయం కూలిపోయే దశలో ఉంది. భవనాన్ని చూసినవారంతా ఇది ప్రభుత్వ కార్యాలయమా.. లేక పాడుబడ్డ బంగ్లానా అంటూ ఆశ్చర్యపోతున్నారు. మావల మండలం ఏర్పడ్డాక 2016లో ప్రభుత్వం మండలానికి ప్రత్యేక తహసీల్దార్ కార్యాలయాన్ని మంజూరు చేసింది. ప్రభుత్వం నూతన భవనం కేటాయించకుండా.. 50 ఏండ్ల క్రితం నిర్మించిన కైలాస్నగర్ లోని వైట్క్వార్టర్భవనాన్ని కేటాయించింది.
పూర్థిగా శిథిలావస్థలో ఉన్న ఈ భవనం పైకప్పు తరచూ పెచ్చులూడుతుండడంతోపాటు ఫ్లోరింగ్ టైల్స్ పూర్తిగా పగిలిపోయాయి. గోడలకు నాచు పేరుకుపోయింది. ఎప్పుడు ఏ గోడ కూలి తమపై పడుతుందోనని సిబ్బంది, అధికారులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు.
వర్షాకాలంలో సీలింగ్ నుంచి నీటి చుక్కలు పడడంతో విలువైన రికార్డులుసైతం తడిసిపోయాయి. మూడు నెలల క్రితం కలెక్టర్ రాజర్షి షా విద్యాశాఖకు సంబంధించి ఆర్వీఎం భవనాన్ని ఈ కార్యాలయానికి కేటాయించాలని ఆదేశించినా జిల్లా విద్యాధికారి భవనం ఖాళీ చేయకపోవడంతో ఇందులోనే కొనసాగిస్తున్నారు. శిథిల భవనంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని విధులు నిర్వహిస్తున్నామని అధికారులు, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రత్యామ్నాయం చూపాలని కోరుతున్నారు.