
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : మావోయిస్ట్ పార్టీ డిప్యూటీ దళ కమాండర్‌తో పాటు ఓ కొరియర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ బి.రోహిత్‌సింగ్ తెలిపిన వివరాల ప్రకారం... దుమ్ముగూడెం మండలంలోని ములకనపల్లి అటవీ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ బలగాలు కూంబింగ్ చేస్తున్నాయి. ఈ టైంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు కిష్టారం ఎల్‌వోఎస్ డిప్యూటీ దళ కమాండర్‌గా పనిచేస్తున్న పుట్టం మున్నా అలియాస్ సన్నాల్ కాగా, మరొకరు కొరియర్‌గా పనిచేస్తున్న జాడి పెద్దబ్బాయ్‌గా గుర్తించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాకు చెందిన మున్నా 2004 నుంచి మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్నారని తెలిపారు. 2014లో కాసల్పాడు దగ్గర 14 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను చంపిన ఘటనతో పాటు 2021లో జిరాంఘాట్ ఘటనలో 22 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను హతమార్చిన ఘటనల్లో మున్నా పాల్గొన్నారని ఎస్పీ తెలిపారు. మావోయిస్ట్ అగ్ర నేతల్లో ఒకరైన హిడ్మా వద్ద కూడా మున్నా పనిచేశారని చెప్పారు. జాడి పెద్దబ్బాయ్ గత మూడేండ్లుగా కొరియర్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు.