అక్కడ యుద్ధం.. ఇక్కడ సన్నద్ధం !

  • వరుస ఎన్‌‌‌‌కౌంటర్లతో అల్లకల్లోలంగా దండకారణ్యం
  • చెల్లాచెదురవుతున్న మావోయిస్టులు.. తెలంగాణలో హైఅలర్ట్‌‌‌‌
  • ములుగు బోర్డర్‌‌‌‌లోని కర్రె గుట్టల్లో పలువురు మావోయిస్టులు
  •  చుట్టూ ల్యాండ్‌‌‌‌ మైన్లు అమర్చారనే అనుమానాలతో అప్రమత్తమైన పోలీసులు
  • సర్వసన్నద్ధంగా తెలంగాణ గ్రేహౌండ్స్

భద్రాద్రికొత్తగూడెం/భద్రాచలం, వెలుగు : వరుస ఎన్‌‌‌‌కౌంటర్లతో చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లోని దండకారణ్యం నెత్తురోడుతోంది. ఇన్నాళ్లూ నక్సల్స్‌‌‌‌కు షెల్టర్‌‌‌‌జోన్‌‌‌‌గా ఉన్న అబూజ్‌‌‌‌మఢ్‌‌‌‌ను సైతం కేంద్ర, రాష్ట్ర బలగాలు చుట్టుముట్టేశాయి. దీంతో చెల్లాచెదురవుతున్న మావోయిస్టులు తెలంగాణలో ప్రవేశించే అవకాశముందన్న కేంద్ర హోంశాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా నక్సల్స్​ఏరివేతలో అపార అనుభవమున్న తెలంగాణ గ్రేహౌండ్స్, స్పెషల్​పార్టీ పోలీస్‌‌‌‌ బలగాలు సర్వసన్నద్ధమయ్యాయి. రెండు రాష్ట్రాల​సరిహద్దులో మోహరించి, కూంబింగ్‌‌‌‌ చేస్తున్నాయి. 

మావోయిస్టులు బోర్డర్​దాటలేరని, దాటితే ఏరివేస్తామని ప్రకటనలు గుప్పిస్తున్నాయి. మరోవైపు ములుగు జిల్లా, చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతమైన కర్రె గుట్టల్లో కొందరు మావోయిస్టులు తిష్ట వేశారని, చుట్టూ ల్యాండ్‌‌‌‌మైన్లు అమర్చి రక్షణ కవచాన్ని ఏర్పరుచుకున్నారని నిఘా టీమ్స్‌‌‌‌ అనుమానిస్తున్నాయి. ఇటీవల ఆ ప్రాంతంలో ల్యాండ్‌‌‌‌మైన్‌‌‌‌ పేలి కొందరు గిరిజనులు గాయపడడంతో ఒక్కసారిగా అప్రమత్తమైన గ్రేహౌండ్స్, స్పెషల్‌‌‌‌ పార్టీ పోలీసులు అడవులను జల్లెడపడ్తున్నాయి.

​ దండకారణ్యంపై దండెత్తుతున్న పోలీస్‌‌‌‌ బలగాలు

తెలంగాణ – చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ రాష్ట్రాల్లోని దండకారణ్యంపై పోలీస్‌‌‌‌ బలగాలు దండెత్తుతున్నాయి. వరుస ఎన్‌‌‌‌కౌంటర్లు, ఎదురుకాల్పులతో దండకారణ్యంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌‌‌‌ నెలకొంది. మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్న దండకారణ్యంలోని అబూజ్‌‌‌‌మఢ్‌‌‌‌లో పాగా వేయడమే లక్ష్యంగా చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ పోలీస్‌‌‌‌లు, కేంద్ర బలగాలు దూసుకెళ్తున్నాయి. 

మావోయిస్టులను కట్టడి చేయడమే లక్ష్యంగా చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లో ప్రతి ఐదు కిలోమీటర్లకు ఓ బేస్‌‌‌‌ క్యాంప్‌‌‌‌ ఏర్పాటు చేయడంతో మావోయిస్టులు చక్రబంధంలో చిక్కుకున్నట్లయింది. తెలంగాణ, చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ సరిహద్దుల్లోనూ పోలీస్‌‌‌‌ బలగాలు బేస్‌‌‌‌ క్యాంపులు ఏర్పాటు చేసుకుంటూ మావోయిస్టుల కదలికలకు అడ్డుకట్ట వేస్తున్నాయి. మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా చేపట్టిన ‘ఆపరేషన్‌‌‌‌ కగార్‌‌‌‌’లో భాగంగా కేంద్ర బలగాలు దండకారణ్యంలో నుంచి మావోయిస్టులను ఏరేస్తున్నాయి.  

మావోయిస్టుల షెల్టర్‌‌‌‌జోన్‌‌‌‌గా కర్రెగుట్టలు !

చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌, తెలంగాణలోని ములుగు జిల్లా సరిహద్దుల్లో ఉన్న కర్రె గుట్టలను మావోయిస్టులు షెల్టర్‌‌‌‌జోన్‌‌‌‌గా ఏర్పాటు చేసుకున్నారని పోలీస్‌‌‌‌ నిఘా బృందాలు గుర్తించాయి. పోలీస్‌‌‌‌ బలగాలు కర్రె గుట్టల వైపు అడుగు పెట్టకుండా గుట్టల చుట్టూ ల్యాండ్‌‌‌‌మైన్స్‌‌‌‌ పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కర్రె గుట్టలకు సమీపంలోని అంకన్నపాలెం అటవీ ప్రాంతంలో వారం కింద ఓ ల్యాండ్‌‌‌‌మైన్‌‌‌‌ పేలడంతో ఆ ప్రాంతం గుండా వెళ్తున్న గిరిజనులు గాయపడ్డారు. దీంతో పోలీసులు అలర్ట్‌‌‌‌ అయ్యారు. మరో వైపు తెలంగాణకు ముఖ ద్వారాలైన భద్రాద్రికొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ సరిహద్దుల్లోనూ బేస్‌‌‌‌ క్యాంపుల ఏర్పాటు మావోయిస్టులను అడవి దాటకుండా చేస్తున్నాయి. 

అదను కోసం చూస్తున్న గ్రేహౌండ్స్‌‌‌‌

మావోయిస్టుల కట్టడిలో ఆరితేరిన తెలంగాణ గ్రేహౌండ్స్‌‌‌‌ బలగాలు అదను కోసం వేచిచూస్తున్నాయి. మావోయిస్టులు తెలంగాణలోకి అడుగు పెట్టకుండా చూడాలని, ఒకవేళ ఎంటర్‌‌‌‌ అయితే ఏరిపారేయాలని స్పెషల్‌‌‌‌ పార్టీ పోలీసులతో పాటు గ్రేహౌండ్స్‌‌‌‌ బలగాలకు పోలీస్‌‌‌‌ శాఖ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సరిహద్దు ప్రాంతమైన చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లో మావోయిస్టులు, ప్రత్యేక బలగాలకు మధ్య జరుగుతున్న వార్‌‌‌‌ను ఎప్పటికప్పుడు గమనిస్తూ బలగాలను అప్రమత్తం చేస్తున్నామని భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ బి. రోహిత్‌‌‌‌రాజు చెప్పారు.

మావోయిస్టుల సొరంగం గుర్తింపు, ఆయుధాలు స్వాధీనం

భద్రాచలం, వెలుగు : చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మావోయిస్టులకు సంబంధించిన సొరంగాన్ని శుక్రవారం డీఆర్జీ బలగాలు కనుగొన్నాయి. సుక్మా, -బీజాపూర్‌‌‌‌ జిల్లాల బోర్డర్‌‌‌‌లోని తుమ్రేల్‌‌‌‌ తాలిపేరు నది మధ్య ఈ సొరంగాన్ని గుర్తించారు. దాని లోపలికి వెళ్లిన జవాన్లు అక్కడ ఉన్న ఆయుధాలు, పేలుడు పదార్థాలను తయారు చేసే డంప్‌‌‌‌ను స్వాధీనం చేసుకున్నారు. సొరంగంలో ఉన్న ఎలక్ట్రికల్‌‌‌‌ వైర్లు, బాటిల్‌‌‌‌ బాంబులు, ఇతర మెటీరియల్‌‌‌‌ను స్వాధీనం చేసుకున్నారు. 

కాంకేర్‌‌‌‌ జిల్లాలో ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌, తప్పించుకున్న మావోయిస్టులు

చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ రాష్ట్రంలోని కాంకేర్‌‌‌‌ జిల్లా చోటేబేటియా పీఎస్‌‌‌‌ పరిధిలోని సిత్‌‌‌‌రాం అడవుల్లో శుక్రవారం ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌ జరిగింది. కూంబింగ్‌‌‌‌ చేస్తున్న డీఆర్‌‌‌‌జీ, బీఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ జవాన్లకు మావోయిస్టులు కనిపించడంతో ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌ ప్రారంభమైంది. భారీ సంఖ్యలో జవాన్లు చుట్టుముట్టడంతో అప్రమత్తమైన మావోయిస్టులు గుట్టల్లోకి పారిపోయారు. సంఘటనా స్థలంలో దళ కమాండర్‌‌‌‌ మోతీరాంను బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. బర్మార్‌‌‌‌ తుపాకీ, దేశీయ ఎయిర్‌‌‌‌ గన్‌‌‌‌, 7 రాకెట్‌‌‌‌ లాంచర్లు, ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్‌‌‌‌ ఐజీ సుందర్‌‌‌‌ రాజ్‌‌‌‌ వెల్లడించారు. అరెస్ట్‌‌‌‌ అయిన మావోయిస్ట్‌‌‌‌ మోతీరాం అలియాస్‌‌‌‌ రాకేశ్‌‌‌‌ ఉసెండిపై రూ.8 లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపారు. 

ఇన్‌‌‌‌పార్మర్‌‌‌‌ నెపంతో వ్యక్తి హత్య

ఇన్‌‌‌‌ఫార్మర్‌‌‌‌ అంటూ చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ రాష్ట్రంలోని బీజాపూర్‌‌‌‌ జిల్లా మిర్తూర్‌‌‌‌ పీఎస్‌‌‌‌ పరిధిలోని హల్లూరు గ్రామానికి చెందిన అప్కా సుక్కూ (48) గురువారం రాత్రి మావోయిస్టులు హత్య చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న సుక్కూను సాయుధ బలగాలు తమ వెంట గ్రామ శివారులోకి తీసుకెళ్లి కత్తి గొంతు కోశారు. దీంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఘటనాస్థలంలో బైరంగఢ్‌‌‌‌ ఏరియా కమిటీ పేరుతో మావోయిస్టులు ఓ లెటర్‌‌‌‌ను వదిలి వెళ్లారు. 

ఐఈడీ పేలి ఇద్దరు జవాన్లకు గాయాలు

మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి ఇద్దరు జవాన్లకు తీవ్రగాయాలు అయ్యాయి. నారాయణ్‌‌‌‌పూర్‌‌‌‌ జిల్లా పరిధిలోని గర్పా బేస్‌‌‌‌ క్యాంప్‌‌‌‌ నుంచి బీఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ జవాన్లు శుక్రవారం కూంబింగ్‌‌‌‌కు వెళ్లారు. భద్రతాబలగాలను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు అమర్చిన ఐఈడీపై జవాన్లు కాలు వేయడంతో అది ఒక్కసారిగా పేలింది. దీంతో ఇద్దరు జవాన్లకు గాయాలు అయ్యాయి. వారిని వెంటనే నారాయణ్‌‌‌‌పూర్‌‌‌‌ జిల్లా హాస్పిటల్‌‌‌‌కు తరలించారు.

క్షణం క్షణం.. టెన్షన్‌‌‌‌ టెన్షన్‌‌‌‌

ఓ వైపు పోలీసులు, మరోవైపు మావోయిస్టుల తుపాకుల మోతతో కొన్ని నెలలుగా దండకారణ్యం దద్దరిల్లుతోంది. ఇన్‌‌‌‌పార్మర్ల పేరుతో పలువురిని ఇటీవల మావోయిస్టులు చంపేశారు. తెలంగాణ, చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లో ఏడాదిన్నర కాలంలో జరిగిన పలు ఎన్‌‌‌‌కౌంటర్లలో 280 మందికి పైగా మావోయిస్టులు నేలకొరిగారు. తెలంగాణకు 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలోనే చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లో 20 రోజుల వ్యవధిలో జరిగిన ఎన్‌‌‌‌కౌంటర్లలో 25 మందికిపైగా చనిపోయారు.

 ఓ వైపు భారీ సంఖ్యలో మావోయిస్టులు చనిపోతున్నా, మరో వైపు అదను దొరికినప్పుడల్లా పోలీసులపై గెరిల్లా దాడులకు పాల్పడుతున్నారు. బీజాపూర్‌‌‌‌ జిల్లా కుట్ర పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌ పరిధిలోని అంబేలి అటవీ ప్రాంతంలో ఈ నెల 6న మావోయిస్టులు ఐఈడీ పేల్చడంతో 8 మంది జవాన్లతో పాటు వెహికల్‌‌‌‌ డ్రైవర్‌‌‌‌ చనిపోయాడు. దీంతో మావోయిస్టులను పూర్తి స్థాయిలో మట్టుబెట్టేందుకు ప్రత్యేక బలగాలు మావోయిస్టుల షెల్టర్‌‌‌‌ జోన్‌‌‌‌ వైపు కదులుతున్నాయి. పోలీస్‌‌‌‌ దాడులు పెరగడంతో మావోయిస్టులు ఓ చోట స్థిరంగా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలోని భద్రాద్రికొత్తగూడెం, ములుగు జిల్లాలతో పాటు చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లోని సుక్మా, బీజాపూర్, బస్తర్‌‌‌‌లోని ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు, మావోయిస్టుల సంచారంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.