మావోయిస్టుల బంద్ ప్రశాంతం

మావోయిస్టుల బంద్ ప్రశాంతం
  •  తెలంగాణ– చత్తీస్ గడ్ సరిహద్దుల్లో ప్రభావం
  • స్వచ్ఛందంగా షాపులు మూసివేసిన వ్యాపారులు 
  • ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసుల అలర్ట్ 

వెంకటాపురం వెలుగు: మావోయిస్టుల రాష్ట్ర బంద్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణ– చత్తీస్ గడ్ సరిహద్దుల్లోని ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాలైన వెంకటాపురం, వాజేడు మండలాల్లో బంద్ ప్రభావం కనిపించింది. ఉదయం నుంచి దుకాణాలు, ఫర్టిలైజర్స్ షాపులు, వస్త్ర వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేశారు. సాయంత్రం 5 గంటల తర్వాత తెరిచారు. బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా  రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోని స్టేషన్ల పోలీసులను ములుగు జిల్లా ఎస్పీ శబరీశ్​అలర్ట్ చేశారు.  

వెంకటాపురం సర్కిల్ పరిధి అలుబాక సీఆర్పీఎఫ్ క్యాంపు, వెంకటాపురం, వాజేడు, పేరూరు పీఎస్ లను సీఐ బండారి కుమార్ అప్రమత్తం చేశారు. గ్రామాల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. రోడ్లపై వాహనాలను తనిఖీలు చేశారు. 

వెంకటాపురం ఎస్ఐ కొప్పుల తిరుపతి రావు, టేకులగూడెం ఎస్ఐ గుర్రం కృష్ణ ప్రసాద్ ముమ్మరంగా చెకింగ్ లు చేపట్టారు.  కాగా.. ములుగు జిల్లాలో గత నవంబర్ 30న జరిగిన చల్పాక ఎన్ కౌంటర్ కు నిరసనగా మావోయిస్టుల రాష్ట్ర కమిటీ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.