హైదరాబాద్, వెలుగు: మ్యాక్సివిజన్ కంటి ఆస్పత్రి పెద్ద ఎత్తున విస్తరించడానికి ప్రయత్నాలను మొదలుపెట్టింది. ఇందుకోసం సింగపూర్‌కు చెందిన క్వాడ్రియా క్యాపిటల్ నుంచి రూ.1,400 కోట్ల పెట్టుబడిని సంపాదించింది. ఈ ఏడాది చివరి నాటికి తన నెట్వర్క్ ను 42 ఆసుపత్రుల నుంచి 100 దాకా విస్తరించడానికి ఈ డబ్బును ఉపయోగించనుంది. ప్రస్తుత ఆసుపత్రులలో ప్రపంచస్థాయి సౌకర్యాలను ఏర్పరచడానికి, మెరుగుపరచడానికి కొంతడబ్బును ఉపయోగిస్తామని సంస్థ సీఈఓ వీఎస్ సుధీర్ చెప్పారు.
సోమాజిగూడలోని సూపర్ టాషరీ ఐ కేర్ సెంటర్లో కొత్త సదుపాయాలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రస్తుతం మాకు 42 హాస్పిటళ్లు ఉన్నాయి. హైదరాబాద్‌లో త్వరలో మూడు ఆస్పత్రులు ప్రారంభిస్తాం. వచ్చే ఏప్రిల్ నాటికి సిద్ధిపేటలోనూ ఒక హాస్పిటల్‌ను తెరుస్తాం. తెలంగాణలోని టైర్–2 సిటీల్లో రెండు హాస్పిటల్స్‌ను ఓపెన్ చేస్తాం. ఏపీలో కొత్తగా ఆరు ఆస్పత్రులను తెరుస్తాం. తెలుగు రాష్ట్రాల్లో విస్తరణ కోసం రూ.500 కోట్లు ఖర్చు చేస్తాం.
మాకు మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లోనూ హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లోనూ మరిన్ని హాస్పిటల్స్‌ను రాబోయే నాలుగేళ్లలో అందుబాటులోకి తెస్తాం. తమిళనాడులో హాస్పిటల్ ఏర్పాటు చేయడానికి అక్కడి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ప్రస్తుతం మాకు 1,200 మంది ఉద్యోగులు, 200 మంది డాక్టర్లు ఉన్నారు. ఉద్యోగుల సంఖ్యను రెండు వేలకు పెంచుతాం. డాక్టర్ల సంఖ్య కూడా పెరుగుతుంది. ఐదేళ్లలోపు ఐపీఓకు వస్తాం”అని ఆయన వివరించారు.