- ఉమ్మడి పాలమూరులోని 14 స్థానాలకు వందకు పైగా అప్లికేషన్లు
- ఈ నెలాఖరునాటికి ఫైనల్ కానున్న లిస్ట్
మహబూబ్‌నగర్, వెలుగు : బీజేపీ టికెట్ల కోసం లీడర్లు పోటీ పడి దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాలకు వందకు పైగా అప్లికేషన్లు వచ్చినట్లు ఆ పార్టీ వర్గాలు చెప్పాయి. ఒక్కో నియోజకవర్గం నుంచి నలుగురైదుగురు అప్లై చేసుకోగా, అత్యధికంగా వనపర్తి అసెంబ్లీ సెగ్మెంట్లో పోటీ చేసేందుకు 20 మంది దరఖాస్తు చేసుకున్నారు. అత్యల్పంగా కల్వకుర్తి అసెంబ్లీ నుంచి కేవలం ఒకరే అప్లై చేసుకోవడం విశేషం.
టికెట్ కోసం పోటీ పడుతున్రు..
మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని లీడర్లు బీజేజీ టికెట్ కోసం పోటీ పడ్డారు. ఎలాంటి ఫీజ్ లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించడంతో కార్యకర్తలతో పాటు మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర, జాయతీ స్థాయి లీడర్లు అప్లికేషన్ పెట్టుకున్నారు. వనపర్తి నుంచి మున్నూరు రవీందర్, బి.కృష్ణ, సబిరెడ్డి వెంకట్ రెడ్డి, సర్వేశ్వర్ రెడ్డి, జింకల కృష్ణయ్య, ఎన్ఆర్ఐ అనుజ్ఞ రెడ్డి, దుప్పల్లి నారాయణ, బి.శ్రీశైలం, రామన్నగారి వెంకటేశ్వర్ రెడ్డి, బండారు కుమారస్వామి, బాసెట్టి శ్రీనివాసులు, గౌని వేమారెడ్డి, కొండ విజయ భాస్కర్, అశ్విని నందకుమార్, రాంరెడ్డి, భూపతి గౌడ్, ఆశన్నతో పాటు మరో ఇద్దరు ఉన్నారు.
గద్వాల నుంచి వెంకటాద్రిరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, సంగాల అయ్యప్పరెడ్డితో పాటు మరొకరు, అలంపూర్ నుంచి బంగి లక్ష్మణ్‌తో పాటు మరో ముగ్గురు, కొల్లాపూర్ నుంచి ఇద్దరు, అచ్చంపేట నుంచి నలుగురు, నాగర్‌కర్నూల్ నుంచి 10 మంది అప్లై చేసుకున్నారు. కల్వకుర్తి నుంచి టి.ఆచారి మినహా ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు. నారాయణపేట నుంచి రతంగ్ పాండురెడ్డి, పగడాకుల శ్రీనివాస్, సత్యయాదవ్, అయ్యప్ప, సత్య రఘుపాల్ రెడ్డి, లక్ష్మి, మురళి, మక్తల్ నుంచి కొండయ్య, భాస్కర్, జలంధర్ రెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి, కుర్వ రవికుమార్, వెంకట్రాములు, షాద్‌నగర్ నుంచి ఏపీ మిథున్‌రెడ్డి, పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు, కొడంగల్ నుంచి 12 మంది, దేవరకద్ర నుంచి దేవరకద్ర బాలన్న, వల్లపురెడ్డి సుదర్శన్‌రెడ్డి, ఎగ్గని నర్సింహులు, నంబి రాజు, బాలమణెమ్మతో పాటు మరో ఆరుగురు,
మహబూబ్‌నగర్ నుంచి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్‌రెడ్డి, మాజీ మంత్రి పి.చంద్రశేఖర్, పడాకుల బాలరాజు, తిరుపతిరెడ్డి, బ్రహ్మహరి, జడ్చర్ల నుంచి వీరబ్రహ్మచారి, ఆర్.బాలాత్రిపుర సుందరితో పాటు మరో 11 మంది అప్లై చేసుకున్నారు. అయితే, ముందు నుంచి బీజేపీ దేవరకద్ర టికెట్ వస్తుందని ఆశించిన డోకూరు పవన్కమార్రెడ్డి అప్లై చేసుకోకపోవడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
సోమశిల నుంచి బస్సుయాత్ర..
రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 27 నుంచి బీజేపీ హైకమాండ్ బస్సుయాత్రలు నిర్వహించనుంది. ఒకేసారి మూడు చోట్ల ఈ యాత్రలను ప్రారంభించనున్నారు. పార్టీ స్టేట్ చీఫ్ కిషన్‌రెడ్డికి పాలమూరు సెంటిమెంట్ కావడంతో ఆయన ఇక్కడి యాత్రను ప్రారంభించనున్నారు. యాత్రలో ఆయన వెంట పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్‌రెడ్డి పాల్గొంటారు. ఉమ్మడి జిల్లాలోని ఐదు జిల్లాల మీదుగా ఈ యాత్ర సాగనుంది. రెండు రోజుల్లో యాత్ర రూట్ మ్యాప్‌తో పాటు షెడ్యూల్ ప్రకటించనున్నారు.
ఈ నెలాఖరుకు ఫైనల్..
లీడర్ల నుంచి తీసుకున్న అప్లికేషన్లను పార్టీ హైకమాండ్ ఈ నెలాఖరుకల్లా ఫైనల్ చేయనున్నట్లు తెలిసింది. గత నెల 22 నుంచి వారం రోజుల పాటు ఉమ్మడి జిల్లాలో పర్యటించిన కర్నాటక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వివిధ అంశాలను పరిశీలించి తయారు చేసిన రిపోర్ట్‌ను కేంద్ర మంత్రి అమిత్‌షా, సునీల్ బన్సల్, తరుణ్‌చుగ్, పార్టీ స్టేట్ చీఫ్ కిషన్‌రెడ్డికి అందించారు. ఈ రిపోర్ట్ ఆధారంగా అభ్యర్థిత్వాలను ఫైనల్ చేయనున్నారు.