ఇప్పుడు మేల్కొనకపోతే మునుగుడే
సిద్ధమవ్వకపోతే 25 లక్షల మంది బలి కాక తప్పదు
అన్ని ఏర్పాట్లు చేసుకుంటే 10 లక్షలకు తగ్గే అవకాశం
సీడీడీఈపీ డైరెక్టర్ రమణన్ లక్ష్మీనారాయణ్
ప్రపంచంలో కరోనా కేసులు 3 లక్షలు దాటింది. వైరస్‌తో చనిపోయేటోళ్లు చనిపోతూనే ఉన్నారు.. కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మరి, మన దేశంలో పరిస్థితి ఏంటి? మొత్తంగా ఎంత మందికి వైరస్ సోకే ముప్పుంది? ఎంత మంది చనిపోతారు? ఈ ప్రశ్నలన్నింటికీ సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్, ఎకనామిక్స్ అండ్ పాలసీ (సీడీడీఈపీ) డైరెక్టర్ రమణన్ లక్ష్మీనారాయణ్ సమాధానాలిచ్చారు. మొత్తం 30 కోట్ల మంది కరోనా బాధితులయ్యే అవకాశం ఉందని, తక్కువలో తక్కువ 20 కోట్ల మందికైనా వైరస్ అంటుతుందని అన్నారు. సరైన జాగ్రత్తలు, సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తేనే తక్కువ కేసులు నమోదవుతాయన్నారు. దేశంలో ఉన్న మౌలిక వసతులు, అమెరికా, బ్రిటన్లలో కేసుల లెక్కల ఆధారంగా ఇండియాలో ఎంతమంది వైరస్ బారిన పడతారన్నది ఆయన వివరించారు.
ఫ్లూకు కరోనాకు తేడా ఉంది
ఏటా చాలా మంది ఇండియన్లు ఇన్ఫ్లుయెంజా బారిన పడుతున్నారని, అయితే, కరోనా దానికి పూర్తి భిన్నమైనదని రమణన్ అన్నారు. కరోనా వైరస్‌ను తట్టుకునే ఇమ్యూనిటీ ప్రస్తుతం ప్రజలకు లేదన్నారు. కాబట్టి వైరస్ వేగంగా, ఎక్కువగా వ్యాపిస్తుందని అన్నారు. వైరస్‌తో మరణాల రేటు కూడా ఎక్కువేనన్నారు. అదే ఇప్పుడు ఎక్కువ ఆందోళన కలిగిస్తున్న విషయమన్నారు. దేశంలో 30 కోట్ల మందికి వైరస్ సోకుతుందని, అవన్నీ మైల్డ్ కేసులేనని అన్నారు. కోటి కేసులు మాత్రం చాలా సీరియస్ అని, ఒక ఏడాది మొత్తంలో అన్ని సీరియస్ కేసులు నమోదైతే హ్యాండిల్ చేయడం ఇండియాకు ఈజీయేనని అన్నారు. అయితే ఈ సీరియస్ కేసులు రెండు మూడు వారాల్లోనే నమోదైతే మాత్రం భారీ మూల్యం తప్పదన్నారు. అంత తక్కువ టైంలో అన్ని కేసులను డీల్ చేయడం చాలా కష్టమన్నారు. అలాంటి టైంలో అందరికీ దూరంగా ఉండడమే మంచి చేస్తుందని వివరించారు.
25 లక్షల మంది చనిపోవచ్చు
దేశంలో కరోనాకు బలయ్యే వారి సంఖ్య మనం వైరస్‌ను ఎదుర్కోవడానికి తీసుకుంటున్న సన్నద్ధతపై ఆధారపడి ఉంటుందని రమణన్ వివరించారు. హెల్త్ అధికారులు సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోతే 20 లక్షల నుంచి 25 లక్షల మంది చనిపోయే ముప్పు ఉంటుందని హెచ్చరించారు. వైరస్ కట్టడికి సరైన చర్యలు తీసుకుంటే అది పది లక్షలకు తగ్గే చాన్స్ ఉంటుందన్నారు. ఇందులో 60 ఏళ్లకు పైబడినవారే ఎక్కువగా ఉంటారని చెప్పారు. ఆస్పత్రుల్లో కరోనా వైరస్ పేషెంట్లకు ప్రత్యేక బెడ్లు పెంచడం, ప్రత్యేక ప్రాంతాల్లో వాళ్లను ఐసోలేషన్ చేయడం, మరిన్ని వెంటిలేటర్లను అందుబాటులో పెట్టుకోవడం వంటివి చేస్తే మరణాలు తగ్గే అవకాశం ఉంటుందని చెప్పారు. కాబట్టి వచ్చే రెండు వారాలను చాలా సీరియస్‌గా తీసుకోవాలని, కఠినమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
దూరం ఎందుకు ముఖ్యం?
వైరస్ మరింత మందికి సోకుండా వేరేవాళ్లకు దూరంగా ఉండడమే సోషల్ డిస్టెన్సింగ్. ఓ వ్యక్తికి కనీసం ఓ మీటర్ దూరం ఉండడమూ అందులో భాగమే. ఇంట్లో నుంచి బయటకు వెళ్లకపోవడం, ఇంట్లో వాళ్లకూ కొంచెం దూరంగా ఉండడం, గుంపుల్లో తిరగకపోవడం వంటివి చాలా ముఖ్యం. అందుకు తగ్గట్టు ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ చర్యలు తీసుకుంటున్నాయి. లాక్డౌన్లు ప్రకటిస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సోషల్ డిస్టెన్సింగ్‌ను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు రమణన్. పెద్ద వాళ్ల ప్రాణాలకు విలువిస్తే కచ్చితంగా సోషల్ డిస్టెన్స్‌ను పాటించాలన్నారు.
For More News..