VHT 2024-25: 5 మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలు.. ఇలాంటోడు కదా భారత జట్టులో ఉండాల్సింది

VHT 2024-25: 5 మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలు.. ఇలాంటోడు కదా భారత జట్టులో ఉండాల్సింది

భారత టెస్ట్ జట్టులో ఓపెనర్ గా ఓ వెలుగు వెలిగిన మయాంక్ అగర్వాల్.. పేలవ ఫామ్ తో టీమిండియాలో స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత మయాంక్ ఫామ్ దిగజారుతూ వస్తుంది. ఈ కర్ణాటక బ్యాటర్ గురించి అందరూ మర్చిపోయిన తరుణంలో ఒక్కసారిగా దూసుకొచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో వరుస సెంచరీలతో మోత మోగిస్తున్నాడు. 5 మ్యాచ్ ల్లో ఏకంగా నాలుగు సెంచరీలు చేసి టీమిండియా సెలక్టర్లకు ఛాలెంజ్ విసిరాడు. ఆదివారం( జనవరి 5) నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 119 బంతుల్లో అజేయంగా 116 పరుగులు చేసి నాలుగో శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. 

టోర్నీలో మయాంక్‌కి ఇది వరుసగా 5వ 50 ప్లస్ స్కోరు కావడం గమనార్హం. డిసెంబర్ 26న పంజాబ్‌తో జరిగిన పోరులో మయాంక్ 139* పరుగులు చేశాడు. ఆ తర్వాత అరుణాచల్‌తో జరిగిన మరుసటి మ్యాచ్‌లో 100 పరుగులతో అజేయంగా నిలిచాడు. డిసెంబర్ 31న  హైదరాబాద్‌పై 15 ఫోర్లు, 2 సిక్సర్లతో 124 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్.. సౌరాష్ట్రతో జరిగిన చివరి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించాడు.

Also Read : ఛాంపియన్స్ ట్రోఫీ.. జట్లని ప్రకటించడానికి అదే చివరి తేదీ

ఇప్పటివరకు 7 ఇన్నింగ్స్‌లలో 153.25 సగటు.. 111.66 స్ట్రైక్ రేట్‌తో 613 పరుగులు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో 66 ఫోర్లు,  18 సిక్సర్లు కొట్టాడు. మయాంక్ అగర్వాల్ కు సైతం నిరాశ తప్పలేదు. కనీస ధర రూ. 1.5 కోట్లకు వేలంలోకి వచ్చిన ఈ భారత ఆటగాడిని తీసుకోవడానికి ఎవరూ ఆసక్తి చూపించలేదు. 2024 ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ తరపున పెద్దగా రాణించలేదు. అంతకముందు పంజాబ్ కింగ్స్ తరపున రూ 14 కోట్ల ధరకు ఆడిన మయాంక్ ను ఇప్పుడు వేలంలో ఒక్కరు కూడా పట్టించుకోలేదు. 

మయాంక్ 2018లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. భారత తరపున ఇప్పటి వరకు 21 టెస్టులు ఆడిన అతను 1488 పరుగులు చేశాడు.  4 సెంచరీలు, రెండు డబుల్ సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. ఐదు వన్డేలు ఆడాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మయాంక్ వరుస సెంచరీలతో భారత జట్టులో చోటు సంపాదిస్తాడేమో చూడాలి.