T20 World Cup 2024: షమీ స్థానంలో మయాంక్‌ను సెలక్ట్ చేయండి: మాజీ చీఫ్ సెలక్టర్

T20 World Cup 2024: షమీ స్థానంలో మయాంక్‌ను సెలక్ట్ చేయండి: మాజీ చీఫ్ సెలక్టర్

లక్నో సూపర్ జయింట్స్ తరపున ఆడుతున్న ఎక్స్ ప్రెస్ పేసర్ మయాంక్ యాదవ్ టీ20 వరల్డ్ కప్ లో చోటు దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. గంటకు నిలకడగా 150 కిలోమీటర్ల వేగంతో పాటు.. ఖచ్చితత్వం కూడిన లైన్ లెంగ్త్ బంతులు వేయడం మయాంక్ స్పెషాలిటీ. ధావన్, బెయిర్ స్టో, మ్యాక్స్ వెల్, పటిదార్ లాంటి స్టార్ ఆటగాళ్లు సైతం ఈ 21 ఏళ్ళ పేస్ ధాటికి సమాధానం లేకుండా పోయింది.

ఇప్పటివరకు 3 మ్యాచ్ లాడిన ఈ యంగ్ బౌలర్ 6 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. రెండు మ్యాచ్ ల్లోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ను గెలుచుకున్నాడు. నిన్న (ఏప్రిల్ 7) గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఒక ఓవర్ మాత్రమే వేసి పక్క నొప్పి కారణంగా  వైదొలిగాడు. మూడు మ్యాచ్ ల్లోనే ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకున్న ఈ యంగ్ బౌలర్ ను భారత మాజీ చీఫ్ సెలక్టర్ MSK ప్రసాద్ ఏకంగా టీ20 వరల్డ్ కప్ కు సెలక్ట్ చేయాల్సిందిగా కోరాడు. 

"ప్రస్తుతం గాయంతో క్రికెట్ కు దూరమైన మహ్మద్ షమీ టీ20 వరల్డ్ కప్ కు అందుబాటులో లేడు. అతని స్థానంలో ప్రమాదకర బౌలర్ మయాంక్ ప్రభావం చూపించగలడు. అతనికి టీ20 వరల్డ్ కప్ జట్టులో ఉండడానికి అర్హుడు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ తర్వాత భారత జట్టులో మూడవ సీమర్ ఎంపికగా ఉత్తరప్రదేశ్ స్పీడ్‌స్టర్‌ను ఎంపిక చేయాలి". అని మాజీ BCCI చీఫ్ సెలెక్టర్ MSK ప్రసాద్ అన్నారు.        
   
మయాంక్ యాదవ్ వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేస్తుండడంతో టీ20 వరల్డ్ కప్ జట్టులో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుమ్రా జతగా మయాంక్ బౌలింగ్ వేస్తే ప్రత్యర్ధులు బెంబెలెత్తడం ఖాయం. ఏప్రిల్ చివరి వారంలో భారత జట్టును ప్రకటిస్తారు. ఈ లోపు లక్నో నాలుగు లేదా ఐదు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇదే ఊపును కొనసాగిస్తే 21 ఏళ్లకే భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యం లేదు.