ఏటూరునాగారం, వెలుగు: మోదీ ప్రభుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా మేడే జరుపుకోవాలని మావోయిస్ట్ పార్టీ భూపాలపల్లి, ములుగు, వరంగల్, పెద్దపల్లి డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేశ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ప్రపంచం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందున ప్రపంచ మార్కెట్ కోసం యుద్ధాలను సృష్టించడం, యుద్ధాలు చేయడం, నయా ఆర్థిక విధానాలను అమలు చేయించడం, కార్మిక శక్తిని, వెనుకబడిన దేశాల సంపదను దోచుకుంటున్నారన్నారు.
దేశంలో కార్మిక, వ్యవసాయ, మత మైనార్టీల వ్యతిరేకంగా చట్టాలు చేస్తూ ప్రజల హక్కులను కాలరాస్తున్నారన్నారు. కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఈ విధానాలను వ్యతిరేకిస్తున్న వారిపై డ్రోన్లు, హెలికాప్టర్లు, యుద్ధ ట్యాంకులు, రాకెట్ లాంచర్ల ద్వారా దాడులను చేయిస్తున్నారని ఆరోపించారు. కార్మికులంతా సంఘటితమై సంఘీభావ ఉద్యమాలు నిర్మించాలని కోరారు.