24 ప్రాంతాల్లో నిమజ్జన ఏర్పాట్లు : మేయర్ గుండు సుధారాణి

24 ప్రాంతాల్లో నిమజ్జన ఏర్పాట్లు : మేయర్ గుండు సుధారాణి

కాశీబుగ్గ(కార్పొరేషన్​), వెలుగు: గణేశ్ ఉత్సవాల్లో భాగంగా నిమజ్జనానికి 24 ప్రాంతాల్లో ఏర్పాట్లు చేయాలని వరంగల్ మేయర్ గుండు సుధారాణి బల్దియా ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం బల్దియా కార్యాలయంలో ఆమె కమిషనర్​అశ్వినీ తానాజీతో కలిసి గణేశ్ ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ 66 డివిజన్లలో వినాయక చవితి వేడుకలకు బల్దియాలో అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ అందజేయడంపై మేయర్ సీఎం రేవంత్​రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

 నిమజ్జనానికి బల్దియా పరిధిలోని హనుమకొండ, వరంగల్ లోని కట్ట మల్లన్న చెరువు, చిన్న వడ్డపల్లి చెరువు, కోట చెరువు, ఉరుసు గుట్ట చెరువు, బెస్తం చెరువు, పెద్ద చెరువు, అగర్తల చెరువు, బంధం చెరువు, సిద్దేశ్వర గుండం, చల్లా చెరువు గోపాల్ పూర్ చెరువు, భీమారం చెరువు, హసన్​పర్తి పెద్ద చెరువు ఇలా మొత్తం 24 చెరువుల్లో ఏర్పాట్లు చేయాలన్నారు. స్థానికంగా ఉండే 24 క్రేన్లతోపాటు ప్రత్యేకంగా 2 భారీ క్రేన్లను ఏర్పాటు చేస్తున్నట్లు మేయర్ తెలిపారు. బల్దియా ఆధ్వర్యంలో చేస్తున్న ఏర్పాట్లలో శానిటేషన్, హై మాస్ట్ లైటింగ్, తాగునీటి సౌకర్యం, బారీకేడ్లు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. 

నిమజ్జనానికి ఐదు రోజుల ముందే చెరువుల్లో గుర్రపు డెక్కను తొలగించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ సీహెచ్ రాజేందర్ రెడ్డి, ఎస్ఈలు ప్రవీణ్ చంద్ర, రాజయ్య, సీఎం హెచ్ వో డాక్టర్ రాజేశ్, ఇన్​చార్జి సిటీ ప్లానర్ రవీందర్, డిప్యూటీ కమిషనర్లు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.