కరీంనగర్, వెలుగు: బండి సంజయ్ కంటే పెద్ద హిందువును తానేనని, బీజేపీ వాళ్లు దేవున్ని రాజకీయాల కోసం వాడుకుంటారని, తాను మాత్రం గుండెలో పెట్టి కొలుస్తానని స్పష్టం చేశారు. అవినీతి సొమ్ముతో ఎన్నికల్లో ఓటుకు రూ.20 వేలు ఇచ్చేందుకు బండి సంజయ్ సిద్ధమయ్యారని.. వాళ్ళు ఇచ్చే డబ్బు తీసుకొని కారు గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరారు. శనివారం కరీంనగర్ రూరల్ మండలంతోపాటు 44,45,26 డివిజన్లలో మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలిసి గంగుల ప్రచారం నిర్వహించారు.
మంత్రి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రంలో ప్రతి గ్రామానికి సురక్షితమైన తాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. కాంగ్రెస్, బీజేపీ మాయమాటలకు మోసపోవద్దని ఎన్నికలప్పుడే కనిపించే బీజేపీ,కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మి మోసపోవద్దని కోరారు. కరీంనగర్ లో ఇప్పటివరకు నిర్వహించిన అభివృద్ధి బీఆర్‌ఎస్ వల్లే జరిగిందన్నారు. రైతులకు పెట్టుబడి సాయం, మద్దతు ధర, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచడంతో రాష్ట్రంలో ప్రస్తుతం వ్యవసాయం పండుగలా మారిందన్నారు. నాడు కరెంట్ కోసం రోడ్లెక్కితే ప్రస్తుతం 24గంటల కరెంట్‌తో ప్రజలు సంతోషంగా ఉన్నారని గుర్తు చేశారు.
కరీంనగర్ గడ్డపై గులాబీ జెండా ఎగురుతుందన్నారు. మరోసారి తనను ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఎలాంటి గ్యారెంటీ లేని కాంగ్రెస్ లీడర్ల మాటలు నమ్మి మోసపోద్దన్నారు. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ నాయకులకు ప్రజలు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు. కరోనా సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వీరంతా ఎక్కడికి పోయారని విమర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సిటీ ప్రెసిడెంట్ హరిశంకర్, కార్పొరేటర్లు శ్రీలత చంద్రశేఖర్, వినోద శ్రీనివాస్, పద్మ కృష్ణ, లీడర్లు శ్రీనివాస్, అక్బర్ హుస్సేన్, చెల్లోజి హరికృష్ణ , మారుతీ, శ్రీనివాస్ రెడ్డి, పద్మయ్య, శోభ పాల్గొన్నారు.