- బాయ్‌కాట్ చేసిన అధికార పార్టీ కార్పొరేటర్లు
- కమిషనర్‌ను ట్రాన్స్ఫర్ చేయించేందుకే ఇలా చేస్తున్నరు
- ప్రతిపక్ష కార్పొరేటర్ల ఆరోపణ
మేడిపల్లి, వెలుగు: ప్రజా సమస్యలపై చర్చించాల్సిన కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్‌ను అధికార పార్టీ మేయర్, కార్పొరేటర్లే బహిష్కరించారు. గురువారం జరిగిన బోడుప్పల్ కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్‌కు మేయర్ సామల బుచ్చిరెడ్డి హాజరుకాకపోగా.. టీఆర్ఎస్ కార్పొరేటర్లు 20 మంది సైతం బాయ్ కాట్ చేశారు. దీంతో ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు దీనిపై మండిపడుతున్నారు. మేడిపల్లిలోని కార్పొరేషన్ ఆఫీసు ముందు నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బోడుప్పల్ కమిషనర్ పద్మజారాణి అక్రమ కట్టడాల విషయంలో సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారని.. పర్మిషన్ లేకపోతే అధికార పార్టీ కార్పొరేటర్ల అనుచరుల నిర్మాణాలను సైతం కూల్చివేయిస్తున్నారన్నారు. దీంతో ఆమెను ట్రాన్స్ ఫర్ చేయించేందుకు మేయర్, టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇలా మీటింగ్ ను బాయ్ కాట్ చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు విమర్శించారు.
కార్పొరేషన్ అభివృద్ధి, ప్రజల సమస్యలను ఏమాత్రం పట్టించుకోకుండా స్వార్థ ప్రయోజనాల కోసం మీటింగ్‌ను బాయ్‌కాట్ చేయడమేంటని వారు ప్రశ్నించారు. మున్సిపల్ చట్టం ప్రకారం నెలకోసారి కౌన్సిల్ మీటింగ్ ను నిర్వహించాల్సి ఉన్నా.. 3 నెలల తర్వాత సమావేశం ఏర్పాటు చేశారన్నారు. దీనికి సైతం మేయర్, టీఆర్ఎస్ కార్పొరేటర్లు హాజరుకాకపోవడం విచారకరమన్నారు. నిరసన తెలిపిన వారిలో బీజేపీ కార్పొరేటర్లు సామల పవన్ రెడ్డి, కుంభం కిరణ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్ కార్పొరేటర్లు పోగుల నర్సింహారెడ్డి, అజయ్ యాదవ్, కల్యాణ్ కుమార్ ఉన్నారు.