రామగుండంలో బీఆర్​ఎస్​కు షాక్​

గోదావరిఖని, వెలుగు: రామగుండం కార్పొరేషన్​లో బీఆర్ఎస్​కు షాక్​ తగిలింది. ఆ పార్టీకి చెందిన మేయర్​ అనిల్​కుమార్ తోపాటు  14 మంది కార్పొరేటర్లు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్​ఠాకూర్​ ఆధ్వర్యంలో కాంగ్రెస్​ తెలంగాణ ఇన్​చార్జి దీపాదాస్​ మున్షీ, మంత్రి శ్రీధర్​బాబు, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్​రావు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. సోమవారం హైదరాబాద్​లో గాంధీభవన్​లో జరిగిన ఈ కార్యక్రమంలో మేయర్​ అనిల్​కుమార్, కార్పొరేటర్లు దాతు శ్రీనివాస్​, సాగంటి శంకర్, వేగోళపు రమాదేవి, ఇంజపురి పులేందర్, దుబాసి లలిత, కల్వల శిరీష, పొన్నం విద్య, దొంత శ్రీనివాస్​, కొమ్ము వేణు,  జెట్టి జ్యోతి, గణ్ముక్కల మహాలక్ష్మి, నీల పద్మ, బాల రాజ్​కుమార్​, మేకల సదానందం కాంగ్రెస్​ పార్టీలో చేరారు.

అలాగే మాజీ కార్పొరేటర్​ కుంట సాయి, మాజీ కో ఆప్షన్​ మెంబర్​ఎండీ గౌస్​ కూడా కాంగ్రెస్ ​గూటికి చేరారు. రామగుండం కార్పొరేషన్​లో 49 మంది కార్పొరేటర్లుండగా వీరి చేరికతో కాంగ్రెస్ ​కార్పొరేటర్ల సంఖ్య 25కు చేరింది. రామగుండం ఎమ్మెల్యే రాజ్​ఠాకూర్​ మాట్లాడుతూ కాంగ్రెస్​ టికెట్​పై గెలిచి పార్టీని వెన్నుపోటు పొడిచి బీఆర్ఎస్​లో చేరిన వారు తిరిగి రావడానికి ప్రయత్నం చేశారని, కానీ కార్యకర్తల అభిప్రాయం మేరకు వారిని చేర్చుకోలేదన్నారు. కాగా, కాంగ్రెస్​లో చేరడానికి వెళ్లిన కార్పొరేటర్లు తాళ్ల అమృతమ్మ, జనగామ కవిత సరోజిని పలు కారణాలతో  చేరకుండా వెనుదిరిగి వచ్చారు.  

బీఆర్ఎస్​కు రాజీనామా...

రామగుండం కార్పొరేషన్​ కో ఆప్షన్​ మెంబర్ ​తానిపర్తి విజయలక్ష్మి, మున్సిపల్​ మాజీ వైస్​చైర్మన్​ తానిపర్తి గోపాల్​రావు సోమవారం బీఆర్ఎస్​కు రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని పార్టీ వర్కింగ్​ప్రెసిడెంట్​ కేటీఆర్​కు పంపారు.