మామూలుగా కేరళలో ఆదర్శ వివాహాలు ఎక్కువగా అవుతుంటాయి. అలాంటి తరహాలోనే తాజాగా తిరువనంతపురం నగర కార్పొరేషన్ మేయర్ ఆర్యా రాజేంద్రన్ తో, ఎమ్మెల్యే సచిన్ దేవ్ వివాహం జరగనుంది. వీరి నిశ్చితార్థం ఇటీవలే జరగగా.. సెప్టెంబర్ 4న తిరువనంతపురం AKG హాల్ లో వీరి పెళ్లి చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వీరి ఆహ్వానానికి సంబంధించిన పోస్టులు ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. అదేంటంటే... తమ పెళ్లికి వచ్చేవారు బహుమతులను తీసుకరావొద్దంటూ వారిద్దరూ తాజాగా సోషల్ మీడియా వేదికగా విన్నవించుకున్నారు. ఎవరైనా తమకు బహుమతులు ఇవ్వాలని భావిస్తే ఆ నగదును వృద్ధాశ్రమాలు లేదా సీఎం రిలీఫ్ ఫండ్ కు పంపించాలని వారివురు కోరారు. దాంతో పాటు తాము చాలా మందిని ఆహ్వానించామని.. ఒకవేళ ఎవరినైనా మరచిపోయినట్టయితే ఈ పోస్ట్ నే ఆహ్వానంగా భావించి వివాహానికి రాగరలని వారు అభ్యర్థించారు. ఇదే తరహా పోస్టును ఆర్యా రాజేంద్రన్ తో పాటు ఎమ్మెల్యే సచిన్ దేవ్ సైతం తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు. దీంతో వీరి పోస్టులు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
అత్యంత చిన్న వయసులోనే మేయర్ గా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తిగా ఆర్యా రాజేంద్రన్ రికార్డు సృష్టిస్తే.. అందుకు సమాన స్థాయిలో దేశంలోనే అత్యంత పిన్న వయసులో బాలస్సేరి ఎమ్మెల్యే అయిన వ్యక్తి సచిన్ దేవ్ పేరు సంపాదించారు. 21ఏళ్లకే మేయర్ గా నియమితులైన పేరు ప్రఖ్యాతలు సాధించి ఆర్యా రాజేందర్, సచిన్ దేవ్ తో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో వీరి పెద్దలు సైతం ఓకే అనేశారు. ఇద్దరూ సీపీఎంకు చెందిన నేతలు. దాంతో పాటు ఇద్దరిదీ ఒకే రాజకీయ సిద్ధాంతం కావడంతో వారి పెళ్లికి ఎలాంటి అడ్డంకీ రాలేదు. దీంతో వారివురి కుటుంబాలు అంగీకరించడంతో వీరి వివాహం ఈ నెల 4వ తేదీన జరగనుంది.