- మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
- ఖైరతాబాద్ జోన్ లోని సర్కిళ్ల అధికారులతో రివ్యూ మీటింగ్
హైదరాబాద్, వెలుగు: నాలాల విస్తరణ, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల పనులను స్పీడ్‌గా కంప్లీట్‌చేసి అందుబాటులోకి తీసుకురావాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశించారు. శనివారం ఖైరతాబాద్ జోన్ పరిధిలో సర్కిళ్ల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. మేయర్ మాట్లాడుతూ బైక్‌లపై వెళ్లి రోడ్ల గుంతలను చూసి జనాల సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ఈవెంట్ కాదని, ఏడాది పాటు ప్రతిరోజు 24 గంటలు సమస్యలు రాకుండా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. రాత్రిపూట రోడ్లపై స్వీపింగ్ మెషీన్ల పని చూసి లాగ్ బుక్ ఆధారంగా చెక్ చేయాలని, పబ్లిక్ టాయిలెట్లు పని చేస్తున్నాయో లేదో చెక్ చేసి డిసెంబర్ లోపు పూర్తిస్థాయిలో పని చేసేట్టు చూడాలని ఆదేశించారు. బెగ్గర్స్ కి నైట్ షెల్టర్ కల్పించేందుకు ప్రాజెక్ట్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కరోనా వ్యాక్సినేషన్ సిటీలో వంద శాతం ఇచ్చేందుకు మొబైల్ వ్యాక్సినేషన్ ద్వారా స్పీడ్‌గా చేపట్టాలని తెలిపారు. అన్ని జోన్లలో వచ్చే ఏడాది జనవరి 3వ తేదీ నుంచి ప్రతి శుక్రవారం గ్రీన్ డే నిర్వహించాలని ఆమె సూచించారు. జోనల్ కమిషనర్ రవి కిరణ్, ఎస్ఈ రత్నాకర్, అధికారులు పాల్గొన్నారు.