డార్క్ స్పాట్ల వద్ద లైటింగ్ పెట్టాలి : మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్ సిటీ/మల్కాజిగిరి, వెలుగు: వినాయక నిమజ్జనానికి అవసరమైన అన్ని వసతులతో సఫిల్​గూడ చెరువును సిద్ధం చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె సికింద్రాబాద్ జోన్ సఫిల్​గూడ మినీ ట్యాంక్ బండ్ ను పరిశీలించారు. చెరువులో ఫ్లోటింగ్ మెటీరియల్, గుర్రపు డెక్క లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సరిపడా క్రేన్లు ఏర్పాటు చేయాలని, భారీ విగ్రహాలను ఎప్పటికప్పుడు నిమజ్జనం చేయాలని సూచించారు. 

చిన్న కుంట వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా చిన్న పిల్లలను నీటికుంట వైపు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరగాలని, డార్క్ స్పాట్స్ వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా లైటింగ్, పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయాలని సూచించారు. శోభాయాత్రలు కొనసాగే రోడ్లపై పాట్​హోల్స్​లేకుండా చూడాలని ఆదేశించారు. 

రోడ్లకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలు కొట్టేయాలని, బోట్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని, అవసరమైతే స్ట్రీట్ లైట్లకు రిపేర్లు చేయాలని చెప్పారు. మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని, 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. మేయర్​వెంట జోనల్ కమిషనర్ రవికిరణ్, డిప్యూటీ కమిషనర్ రాజు, ఇతర విభాగాల అధికారులు ఉన్నారు.