హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ ఆస్తులను డిజిటలైజ్చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను అదేశించారు. మంగళవారం తన చాంబర్ లో ఎస్టేట్స్ అడిషనల్ కమిషనర్లతో మేయర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఆస్తుల నుంచి ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. బల్దియాకు చెందిన ఖాళీ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చూడాలని తెలిపారు.
కేటగిరీల వారీగా ఆస్తుల వివరాలు అందజేయాలని ఆదేశించారు. అద్దెలు సక్రమంగా వస్తున్నాయో లేదో చెక్చేయాలని, లీజ్అయిపోతున్నవాటిని గుర్తించి ఎంట్రీ చేయాలన్నారు. కమ్యూనిటీ భవన్ లు ఎన్ని, వాటిని దేనికోసం ఉపయోగిస్తున్నారో పూర్తి నివేదిక ఇవ్వాలన్నారు. మోడల్ మార్కెట్, మున్సిపల్ మార్కెట్ గదుల వివరాలు, వినియోగిస్తున్న వాటి వివరాలు అందజేయాలని ఆదేశించారు. వచ్చే సమావేశానికి పూర్తి నివేదికతో హాజరు కావాలని చెప్పారు. అడిషనల్ కమిషనర్ కె.శ్రీవాత్సవ తదితరులు పాల్గొన్నారు.