మట్టి గణపతులను పూజించాలి : మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్, వెలుగు :  పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు. శుక్రవారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో  అధికారులు, సిబ్బందికి మట్టి గణేశ్ విగ్రహాలను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్  మాట్లాడుతూ... 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో జరిగే గణేశ్ నవరాత్రి ఉత్సవాలను   పర్యావరణాన్ని కాపాడే విధంగా నిర్వహించుకోవాలని సిటిజన్లను కోరారు.

సిటీ వ్యాప్తంగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా 4.64 లక్షల మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇవ్వాల, రేపు  జీహెచ్ఎంసీ పరిధిలో అన్ని వార్డు ఆఫీసు ఆవరణలో ఉచితంగా పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, ఎస్ఈ కోటేశ్వర రావు, సీఎంవోహెచ్ డాక్టర్ పద్మజ తది తరులు పాల్గొన్నారు. 

ALSO READ: కేరళలో నిఫా కేసులతో కర్నాటక అలర్ట్

బాగ్​లింగంపల్లిలో..

ముషీరాబాద్ :  హైదరాబాద్ జిందాబాద్, వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో శుక్రవారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య పార్కులో మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, బల్దియా డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య పాల్గొన్నారు.