
- మార్చి10 నుంచి అందుబాటులోకి..
హైదరాబాద్ సిటీ, వెలుగు: బిల్డింగుల అనుమతుల అంశాన్ని సులభతరం చేసేందుకు తీసుకువచ్చిన ‘బిల్డ్ నౌ’ ట్రైనింగ్ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో మంగళవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. మేయర్ మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో రూపొందించిన ఫాస్ట్ డ్రాయింగ్ స్క్రూటినీ సిస్టం ద్వారా నిర్మాణ అనుమతుల ప్రక్రియ సులభతరం అవుతుందన్నారు.
బిల్డ్ నౌ ద్వారా నగరవాసులు ఆన్ లైన్ లోనే నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకొని వెంటనే పర్మిషన్పొందవచ్చన్నారు. అన్ని అనుమతులు సింగిల్ విండో సిస్టంలో ఇస్తారన్నారు. మార్చి 9 వరకు ప్రతిరోజు రెండు సెషన్లలో నిర్వహిస్తామని, 10 తేదీ నుంచి కార్యక్రమం ప్రారంభయ్యే అవకాశం ఉందన్నారు.
డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి మాట్లాడుతూ.. బిల్డ్ నౌ పై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. బిల్డ్‌నౌ అప్లికేషన్స్, అనుమతుల ప్రక్రియ పారదర్శకంగా, సులువుగా ఉంటుందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. కూకట్ పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ్ చౌహాన్, చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్, అడిషనల్ కమిషనర్ శివకుమార్ నాయుడు, అడిషనల్ సీసీపీ గంగాధర్, ప్రదీప్ పాల్గొన్నారు.