వీధి కుక్కల నియంత్రణకు చర్యలు: గద్వాల్ విజయలక్ష్మి

వీధి కుక్కల నియంత్రణకు చర్యలు: గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబా, వెలుగు: గ్రేటర్​లో వీధి కుక్కల నియంత్రణకు కమిటీ సూచించిన అంశాలపై చర్యలు తీసుకుంటున్నామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. శనివారం బల్దియా హెడ్డాఫీసులో హైలెవల్ కమిటీ సభ్యులతో మేయర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో పర్యటించిన సభ్యులు.. కుక్కల నియంత్రణకు చేపట్టాల్సిన జాగ్రత్తలపై రూపొందించిన 26 అంశాలతో కూడిన నివేదికను మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. 

ప్రస్తుతమున్న స్టెరిలైజేషన్ సంఖ్యను రోజువారీగా 300 నుంచి 400 వరకు పెంచేలా చర్యలు తీసుకోవాలని, కుక్కలను పట్టుకునేందుకు డాగ్ స్క్వాడ్ టీమ్​లు రాత్రి వేళల్లో కూడా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వెటర్నరీ ఫీల్డ్ అసిస్టెంట్లతోపాటు, వెటర్నరీ డాక్టర్లను కూడా నియమించేలా చర్యలు చేపట్టాలన్నారు. వీధి కుక్కలను పట్టుకునేందుకు ప్రస్తుతం 50 క్యాచింగ్ వెహికల్స్ ఉండగా, మరో 10 ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎన్జీవో, ఏడబ్ల్యూవో, వలంటీర్లు, ప్రజా ప్రతినిధులతో కలిసి జనాలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో హై లెవల్ కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు సీఎన్ రెడ్డి, శ్రవణ్, రాజశేఖర్ రెడ్డి, సయ్యద్ సోహెల్ ఖాద్రీ, అడిషనల్ కమిషనర్ హెల్త్ శృతి ఓజా, వెటర్నరీ అధికారి అబ్దుల్ వకీల్ తదితరులు పాల్గొన్నారు.