- టైంకు రాని బల్దియా ఉద్యోగులపై మేయర్ ఫైర్
- ఆకస్మిక తనిఖీలో 11 దాటినా కనిపించని సిబ్బంది
- సీరియస్ అయిన విజయలక్ష్మి
- టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లపై మండిపాటు
- ఆబ్సెంట్ రిపోర్ట్ ఇవ్వాలని అడిషనల్ కమిషనర్ కు ఆదేశం
హైదరాబాద్ సిటీ, వెలుగు : జీహెచ్ఎంసీ ఉద్యోగులు, ఆఫీసర్లు ఇన్‌టైంలో ఆఫీసుకు రాకపోవడంపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సీరియస్ అయ్యారు. బుధవారం ఆమె బల్దియా హెడ్డాఫీసులోని టౌన్ ప్లానింగ్, హెల్త్, వెటర్నరీ విభాగాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా టౌన్ ప్లానింగ్ విభాగానికి వెళ్లారు. అక్కడి సీట్లలో అధికారులు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడే వచ్చిన కొందరు అధికారులను ‘మీరు ఎన్ని గంటలకు రావాలి?
ఎన్ని గంటలకు వస్తున్నారు? ఇదేనా మీకు చెప్పిన టైం?’ అంటూ ప్రశ్నించారు. కొన్ని సెక్షన్లలో కుర్చీలు ఖాళీగా ఉండడంతో పక్క సీట్లో ఉన్నవారిని వీరు ఇంకా రాలేదా అని అడిగారు. టిఫిన్చేయడానికి వెళ్లారని చెప్పడంతో ఆఫీసుకు వచ్చాక.. డ్యూటీ టైంలో టిఫిన్చేయడానికి వెళ్లడమేంటి అని అసహనం వ్యక్తం చేశారు.
ఏం యాక్షన్ తీసుకున్నారో నివేదిక పంపండి
ప్రజావాణిలో టౌన్ ప్లానింగ్ సెక్షన్ కు ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని, సమస్య పరిష్కారం కాక ఫిర్యాదుదారులు తిరుగుతుంటే ఏం చేస్తున్నారని ఆఫీసర్లపై మేయర్ఆగ్రహం వ్యక్తం చేశారు. హెల్త్ సెక్షన్ లో కొందరు పని పక్కన పెట్టి సెల్ ఫోన్ చూస్తుండడంతో ఫైర్అయ్యారు. ఇన్చార్జి సీఎం అండ్హెచ్ఓఏ టైంకు వస్తున్నారా?
అని సిబ్బందిని అడగడంతో శానిటేషన్ జేసీ వేణుగోపాల్ రెడ్డి జోక్యం చేసుకొని ముషీరాబాద్ సర్కిల్ లో ఏఎం అండ్ హెచ్ఓగా పని చేస్తున్నందున మధ్యాహ్నం వస్తున్నారని చెప్పారు. అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించి ఆలస్యంగా వచ్చిన వారికి ఏ చర్యలు తీసుకున్నారో తనకు నివేదిక పంపాలని అడిషనల్కమిషనర్నళిని పద్మావతిని మేయర్ఆదేశించారు.
ఫుడ్ సేఫ్టీ వాళ్లు ఎక్కడ తనిఖీ చేస్తున్నరు?
‘ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎంత మంది పనిచేస్తున్నారు? ఎక్కడ తనిఖీలు చేస్తున్నారు?’ అని ఇన్చార్జి అసిస్టెంట్ కమిషనర్ ముత్యం రాజును మేయర్ ప్రశ్నించడంతో 23 మంది పని చేస్తున్నారని, కొందరికి ఇతర సర్కిళ్లకు కూడా ఇన్చార్జి బాధ్యతలు ఉన్నాయని చెప్పారు. ఫీల్డ్ లెవల్ లో పనిచేస్తున్నవారితో మాట్లాడించాలని కోరగా శేరిలింగంపల్లి ఫుడ్ ఇన్ స్పెక్టర్ సూర్యకు అధికారులు ఫోన్ చేశారు.
ఆయన ఎక్కడ ఉన్నాడో సరిగ్గా చెప్పకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెడ్డాఫీసుకు వచ్చి తనను కలవాలని మేయర్ఆదేశించారు. తర్వాత వెటర్నరీ విభాగానికి వెళ్లారు. అక్కడ కొంతమంది ఆఫీసర్లు సీట్లలో లేకపోవడంతో ఫైర్అయ్యారు. అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించాలని అడిషనల్ కమిషనర్ ను ఆదేశించారు. ఆబ్సెంట్పై రిపోర్ట్ ఇవ్వాలన్నారు.
గైర్హాజరుపై సమావేశం
అధికారులు సమయానికి రాకపోవడంపై మేయర్ తన ఛాంబర్ లో హెచ్ఓడీలతో సమావేశం నిర్వహించారు. ఇకపై సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. తమ తమ విభాగాల్లో సిబ్బంది టైంకు డ్యూటీలకు వచ్చేలా చూడాలన్నారు. ఇంతకు ముందు కూడా రెండు సార్లు అన్ని విభాగాల్లో ఆకస్మిక తనిఖీ చేశానని
సిబ్బంది 10:30 గంటలకు రావాలని, గ్రేస్ టైం మరో 10 నిమిషాలు మాత్రమే ఉంటుందన్నారు. ఆ లోపు రాకపోతే నెలలో మూడు సార్లు చూసి ఒక క్యాజువల్ లీవ్ కట్ చేస్తామన్నారు. క్యాజువల్ లీవ్ లేకపోతే ఈఎల్ కట్ అవుతుందని స్పష్టం చేశారు.