హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సహాయక చర్యలపై జీహెచ్ఎంసీ అప్రమత్తంగా ఉందని మేయర్ గద్వాల విజయలక్ష్మీ తెలిపారు. ఐదు రోజులుగా జీహెచ్ఎంసీ సిబ్బంది, అధికారులంతా ఫీల్డ్ మీదనే ఉన్నారని చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే క్లియర్ చేస్తున్నామన్నారు. ఐదు రోజులుగా 900 ఫిర్యాదులు వచ్చాయన్నారు. 24 గంటల పాటు కంట్రోల్ రూమ్, జీహెచ్ఎంసి పనిచేస్తోందన్నారు. జీహెచ్ఎంసి పరిధిలో 429 ఎమర్జెన్సీ టీమ్స్ పనిచేస్తున్నాయని..ఇప్పటికే 483 శిథిలావస్థ భవనాలు గుర్తించామని.....అన్నింటికీ నోటీసులు ఇచ్చామన్నారు. వీటిలో 92 భవనాలకు రిపేర్ చేసే అవకాశం ఇచ్చామన్నారు. మరో 19 భవనాలను సీజ్ చేశామని చెప్పారు.
నారాయణగూడలో మాత్రమే కొంత నీటి సమస్యల ఉందని.....అక్కడ 90 శాతంపైగా నాలాల పనులు దాదాపు పూర్తి అయ్యాయని మేయర్ గద్వాల విజయలక్ష్మీ వెల్లడించారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో 36 చోట్ల నాలాల పనులు జరిగితే...30 ప్రాంతాల్లో పూర్తి అయ్యాయన్నారు. గతేడాది వరద సమస్యలు తలెత్తిన ప్రాంతాల్లో ఈ ఏడాది సమస్యలు లేవన్నారు. ప్రజలు తమ సమస్యలను జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కు ఫిర్యాదు చేయొచ్చన్నారు. జీహెచ్ఎంసి సరిగ్గా పనిచేస్తోందని కాబట్టే ఎలాంటి తీవ్రస్థాయి నష్టం జరగలేదన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో వీలైనంత మేరకు ప్రజలకు బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచించారు.