కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: వరంగల్ మహానగరంలో చేపట్టనున్న భూగర్భ, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు కోసం డీపీఆర్ రూపొందించాలని వరంగల్బల్దియా మేయర్ గుండు సుధారాణి అన్నారు. శుక్రవారం బల్దియా హెడ్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన భూగర్భ డ్రైనేజీ, భూగర్భ వరద పారుదల, నీటి సరఫరా వ్యవస్థ సమగ్ర మాస్టర్ ప్లాన్ పై బెంగళూరుకు చెందిన శుభ్ కన్సల్టెన్సీ ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కమిషనర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి పాల్గొని, సమర్ధ వంతంగా నిర్వహించేందుకు మేయర్ సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత వరంగల్ సమగ్ర అభివృద్ధి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కన్సల్టెంట్లను ఆహ్వానించామని, సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పని చేయాలని సూచించారు. స్మార్ట్ సిటీ ద్వారా కొత్త రోడ్లను ఏర్పాటు చేశామని, ప్రాథమిక స్థాయిలో సంబంధిత అధికారులకు భూగర్భ డ్రైనేజీ, వరద పారుదలపై అవగాహన కోసం మాత్రమే సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీజీఎం ఆపరేషన్స్ కిషన్, కుడా సీపీవో అజిత్ రెడ్డి, సీఎంహెచ్వో రాజేష్, సెక్రెటరీ విజయ లక్ష్మి, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.