కాంగ్రెస్ పార్టీ వైపు.. వరంగల్​ మేయర్ ​చూపు!

  • కుర్చీని కాపాడుకునేందుకేనంటూ పొలిటికల్ ​సర్కిళ్లలో చర్చ 
  • ఇప్పటికే మంత్రి సీతక్కను, ఇతర కాంగ్రెస్ ​నేతలను కలిసిన మేయర్ ​సుధారాణి
  • పార్టీ మారుతారంటూ జోరందుకున్న ఊహాగానాలు
  • ఆమె రాకను వ్యతిరేకిస్తున్న వరంగల్​ జిల్లా కాంగ్రెస్‍ పెద్దలు 
  • మేయర్ ​పీఠంపై ఫోకస్​ పెట్టిన గ్రేటర్‍ ఎమ్మెల్యేలు

వరంగల్‍, వెలుగు:  గ్రేటర్‍ వరంగల్‍ కార్పొరేషన్‍ మేయర్‍ గుండు సుధారాణి అడుగులు కాంగ్రెస్‍ వైపు పడ్తున్నాయనే ప్రచారం జోరందుకుంది. రాష్ట్రంలో బీఆర్‍ఎస్‍ పార్టీ అధికారం కోల్పోవడం.. ఇన్నాళ్లు వెంట నడిచిన సొంత పార్టీ కార్పొరేటర్లు విడుతలవారీగా హస్తం గూటికి చేరుతుండడంతో ఆమె ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరో రెండున్నరేళ్లు పదవీ కాలం ఉండటం.. గ్రేటర్ కాంగ్రెస్‍ ఎమ్మెల్యేలు తన మేయర్‍ పీఠంపై కన్నేయడం అమెను రాజకీయంగా కలవరపెడుతోంది. దీంతో కారు వీడి, కాంగ్రెస్‍ కండువా కప్పుకుంటేనే పదవి కాపాడుకోవడానికితోడు గ్రేటర్‍ అభివృద్ధి విషయంలో కావాల్సిన ఫండ్స్ అడుగొచ్చనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది.  కాగా, గుండు సుధారాణి రాకను మాత్రం గ్రేటర్‍ కాంగ్రెస్‍ పెద్దలు వ్యతిరేకిస్తున్నారు.  

కాంగ్రెస్‍ స్పెషల్‍ ఫోకస్‍

గ్రేటర్‍ వరంగల్‍ మేయర్‍గా గుండు సుధారాణి 2021 మే 7న బాధ్యతలు తీసుకున్నారు. గడువు ప్రకారం మరో రెండున్నరేళ్లు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు.  కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‍ పార్టీ అధికారంలోకి రావడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారాయి. ఉమ్మడి వరంగల్​లో 12 నియోజకవర్గాలకుగానూ హస్తం​ పార్టీ 10చోట్ల గెలవడం.. గ్రేటర్ పరిధిలోనూ కాంగ్రెస్​ ఎమ్మెల్యేలే ఉండటంతో ఆ పార్టీ పెద్దలు మేయర్‍ పీఠంపై కన్నేశారు. బల్దియాలో  66 మంది కార్పొరేటర్లు ఉండగా నిన్నమొన్నటి వరకు బీఆర్‍ఎస్‍ 51 సీట్లతో బలంగా కనిపించింది. అసెంబ్లీ ఫలితాలు వచ్చిన నెలలోనే సీన్‍ మారింది. ఇప్పటికే ఏడుగురు సిట్టింగ్‍ కార్పొరేటర్లు  కాంగ్రెస్‍ కండువా కప్పుకున్నారు. మరికొందరు కారు దిగే ఆలోచనలో ఉన్నారు. ఈక్రమంలో తన పీఠానికి ఎసరు వస్తున్న విషయాన్ని మేయర్​ పసిగట్టారు.

పాత టీడీపీ సహచరులతో.. రాయబారం

గుండు సుధారాణికి టీడీపీనే రాజకీయ జీవితమిచ్చింది.  మాజీ సీఎం చంద్రబాబునాయుడు మొదలుకొని సీఎం రేవంత్‍రెడ్డి వరకు ఆమెకు పరిచయాలున్నాయి.  జిల్లాకు చెందిన మంత్రి సీతక్కతో పాటు ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‍రెడ్డి, గండ్ర సత్యనారాయణ, డాక్టర్‍ రామచంద్రునాయక్‍తో కలిసి గుండు సుధారాణి గతంలో టీడీపీలో పనిచేశారు. ఈ నేపథ్యంలో వారి సహకారం కోరుతున్నట్లు తెలుస్తోంది. ఎలాగూ బీఆర్ఎస్​లో మాజీ ఎమ్మెల్యే వర్గం తనతో అంటీముట్టనట్లు ఉండటం.. పలుమార్లు అవమానాలకు గురిచేయడంతో కొంత ఆవేదనతోనే ఉన్నారు. ఈ క్రమంలో దాదాపు 30 ఏండ్ల క్రితం వరంగల్‍ తూర్పు ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి.. ఎన్నికల ముందు కాంగ్రెస్‍ పార్టీలో చేరిన నేత ద్వారా రాయబారం నడిపిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం సుధారాణి  సీతక్కను కలిశారనే టాక్​ నడుస్తోంది. మరో మంత్రి ఆశీస్సుల కోసం సదరు మాజీ ఎమ్మెల్యే ద్వారా  ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. కాగా, ఆమె రాకను జిల్లా కాంగ్రెస్​లీడర్లలో ఒకరిద్దరు స్వాగతిస్తుంటే, ఎక్కువ మంది వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.

మర్యాదపూర్వకంగానే కలిశా

మంత్రులు, ఇతర నేతలను మర్యాదపూర్వకంగా కలిశాను తప్పితే.. పార్టీ మారుతారనే ప్రచారంలో వాస్తవం లేదు. టీడీపీలో పనిచేసిన అనుబంధంతో నేను అప్పటి నేతలతో సఖ్యతగా ఉంటున్నాను. వివిధ పార్టీల నేతల ఇండ్లు ఇంటికి దగ్గరగా ఉన్నాయి. మేయర్‍ పదవికి ఎలాంటి ఇబ్బంది వచ్చే అవకాశం లేదు.

-సుధారాణి, మేయర్​