కరీంనగర్ టౌన్, వెలుగు: తనపై ఎంపీ బండి సంజయ్ చేసిన అవినీతి ఆరోపణలు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని, నిరూపించ లేకపోతే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని మేయర్ సునీల్ రావు సవాల్ విసిరారు. ఆదివారం ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్‌లో మేయర్ మీడియాతో మాట్లాడుతూ సంజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి అసహనంతో తనపై, కార్పొరేటర్లపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు.
గుట్కా, గంజాయి వ్యాపారులను వెంటేసుకుని తిరిగితే ఎన్నికల్లో ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి రాజకీయ పబ్బం గడుపుకోవడం సంజయ్‌కు అలవాటేనన్నారు. ఎంపీ కాకముందు ఒక్క రూపాయి లేదని చెప్పిన సంజయ్.. ఎమ్మెల్యే ఎన్నికల్లో రూ.50కోట్లు ఎలా ఖర్చు చేశారని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ నాయకులమంతా కలిసి పనిచేసి గంగుల కమలాకర్‌ను 4వసారి గెలిపించుకున్నామని గుర్తు చేశారు. సమావేశంలో కార్పోరేటర్లు ఐలేందర్ యాదవ్, కుర్ర తిరుపతి, కల్యాణి, లీడర్లు కోల సంపత్ రెడ్డి, రమణారావు, పవన్, తదితరులు పాల్గొన్నారు.