హైదరాబాద్ సిటీ/మాదాపూర్, వెలుగు: గ్రేటర్‌పరిధిలోని సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. సోమవారం ఆమె అధికారులతో కలిసి హఫీజ్ పేటలోని పలు కాలనీల్లో పర్యటించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఆర్టీసీ కాలనీలో శానిటేషన్, కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని, రోడ్డు వెడల్పు చేయాలని, స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ, పార్కు అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నలగండ్ల చెరువులో సి అండ్ వేస్ట్ తొలగింపునకు చర్యలు తీసుకోవాలన్నారు.
సీఎస్ఆర్ కింద చెరువును అభివృద్ధి చేస్తున్న రాంకీ కంపెనీ వారు వ్యర్థాలను తీసుకుపోవడం లేదని, వెంటనే రాంకీ ప్రతినిధులతో మాట్లాడి వ్యర్థాల తొలగింపునకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నవోదయ కాలనీ సివరేజ్ వాటర్, సెంట్రల్ యూనివర్సిటీ నుండి వరద నివారణకు చేపట్టే పనులను పరిశీలించారు. మేయర్ వెంట కార్పొరేటర్ పూజిత, జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, సీఈ భాస్కర్ రెడ్డి, జోనల్ ఎస్ఈ శంకర్ నాయక్, డీసీ ముకుందరెడ్డి ఉన్నారు.
స్లిప్ అయి కింద పడిన మేయర్
సోమవారం సాయంత్రం మేయర్ విజయలక్ష్మి కాలు స్లిప్అయి కింద పడిపోయారు. పంజాగుట్ట నాగర్జున సర్కిల్ లో బ్యూటిషికేషన్ పనులు ప్రారంభించేందుకు వెళ్లిన మేయర్ మంత్రి పొన్నంతో కలిసి ఫుట్ పాత్ పై నడుస్తుండగా ఒక్కసారిగా కాలు స్లిప్అయి కింద పడ్డారు. పక్కనే ఉన్న డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి మేయర్‌ను పైకి లేపారు. మేయర్ కి ఎటువంటి గాయాలు కాలేదని ఆమె వ్యక్తి గత సిబ్బంది తెలిపారు.