వాళ్లకు ఆ హక్కు ఉంది.. అవిశ్వాస తీర్మానంపై మేయర్ విజయలక్ష్మి కీలక వ్యాఖ్యలు

వాళ్లకు ఆ హక్కు ఉంది.. అవిశ్వాస తీర్మానంపై మేయర్ విజయలక్ష్మి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని బీఆర్ఎస్ యోచిస్తోన్నట్లు గ్రేటర్ హైదరాబాద్ పొలిటికల్ సర్కిల్స్‎లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై  గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ కీలక నేతలు ప్రత్యేకంగా భేటీ అయ్యి ఇప్పటికే చర్చించారని టాక్. ఈ క్రమంలో అవిశ్వాస తీర్మానంపై మేయర్ గద్వాల విజయలక్ష్మి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం (జనవరి 28) ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే హక్కు ప్రతిపక్షాలకు ఉందన్నారు.

 ఫిబ్రవరి 11తో నేను జీహెచ్ఎంసీ మేయర్‎గా బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తవుతుందని.. జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం నాలుగేళ్ల తర్వాతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలన్నారు. కౌన్సిల్‎లో మెజార్టీ లేకపోయిన బీఆర్ఎస్ అవిశ్వాసం పెట్టాలని చూస్తోందని.. నో కాన్ఫిడెన్స్ మోషన్ నెగ్గాలంటే ఎంత మెజార్టీ కావాలో కూడా బీఆర్ఎస్, బీజేపీకి తెలియదని ఎద్దేవా చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లకు జీహెచ్ఎంసీ యాక్ట్ గురించి తెలియదని.. ఎంత మెజారిటీ ఉంటే అవిశ్వాసం నెగ్గుతుందో ముందు తెలుసుకోవాలని చురకలంటించారు. 

ALSO READ | హైదరాబాద్ అంటేనే పెట్టుబడులకు నిలయం: మంత్రి శ్రీధర్ బాబు

అవిశ్వాసం పేరుతో బీజేపీ, బీఆర్ఎస్‎ సభ్యులు కౌన్సిల్ మీటింగ్‎లో రాద్ధాంతం చేయాలని చూస్తే ఊరుకోమని మేయర్ ముందుగానే హెచ్చరించారు. గురువారం జరగబోయే జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్‎లో ప్రజా సమస్యలపై చర్చ జరగాలని.. ఇందుకు కార్పొరేటర్లు అందరూ సహకరించాలని కోరారు. గొడవలు చేసేందుకు కౌన్సిల్ వేదిక కాదన్న మేయర్.. ఇది ఎలక్షన్ ఇయర్ అని అభివృద్ధిపై కార్పొరేటర్లు దృష్టి పెట్టాలని సూచించారు.