కరీంనగర్ జిల్లాలో.. 13స్థానాలు గెలుస్తాం

  •     మేయర్ యాదగిరి సునీల్  రావు

కరీంనగర్ టౌన్, వెలుగు : రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 13స్థానాల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని  మేయర్ యాదగిరి సునీల్ రావు ధీమా వ్యక్తం చేశారు. గురువారం సిటీలోని ఓ  ప్రైవేట్​ ఫంక్షన్ హాల్‌‌‌‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్​ మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా ఎన్నికల్లోకి  వెళ్తున్నామని స్పష్టం చేశారు.  నాలుగున్నరేళ్లు సిటీ ప్రజలకు, నాయకులకు అందుబాటులో లేని ఎంపీ సంజయ్ .. ఎన్నికలనగానే ప్రజల్లోకి వచ్చారని ఆరోపించారు.  సీఎం భార్య తలనీలాలిస్తే  కామెంట్లు చేయడం దారుణం అని మండిపడ్డారు.

కరీంనగర్ లో  ఏ డివిజన్ కు వెళ్లినా  బీఆర్​ఎస్​  చేసిన అభివృద్ధి పనులు కనబడుతున్నాయన్నారు. ఎంపీగా బండి సంజయ్ చేపట్టిన అభివృద్ధి పనులు  ఎక్కడ జరిగాయో  చూపించాలన్నారు.  అభ్యర్థుల్లేక చేరికల కోసం కమిటీని వేసిన  బీజేపీ లీడర్లు మాట్లాడే  ముందు ఆలోచించుకోవాలని  సూచించారు.  జీవన్ రెడ్డి  గత ఎన్నికల్లోనే కనుమరుగై  పోయారని విమర్శించారు. సమావేశంలో  కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్, గంధెమాధవి, ఐలేందర్ యాదవ్, రమణారావు, బుచ్చిరెడ్డి, నాయకులు సంపత్ రెడ్డి, అశోక్, చంద్రమౌళి పాల్గొన్నారు.