గాలి.. నీళ్లతోపాటు నేల కూడా కలుషితమై పోతోంది. దాంతో నేలలో పండిన పంటలు కూడా ఆరోగ్యానికి హాని చేస్తున్నాయి. అందుకే చండీగఢ్‌కు చెందిన ప్రిత్‌పాల్ సింగ్ కొత్తగా ఆలోచించాడు. హైడ్రోపోనిక్స్ విధానంలో నేలతో పనిలేకుండానే ఆకుకూరలు పండిస్తున్నాడు. ఆరోగ్యాన్ని పంచుతున్నాడు.ఉన్న రెండెకరాల్లోనే లక్షల్లో ఆదాయం పండిస్తున్నాడు. తనతోపాటు మిగతా రైతులకు కూడా ఈ పద్ధతిని నేర్పించేందుకు ‘ఫార్మ్కల్ట్’ అనే స్టార్టప్ కూడా పెట్టాడు.
చండీగఢ్‌లో ఉంటున్న ప్రిత్‌పాల్ సింగ్ కుటుంబం 50 ఏండ్లుగా గోధుమలు, వరి సాగు చేశారు. ఒక్క వీళ్లే కాదు.. పంజాబ్, హర్యానాల్లో మోనోక్రాపింగ్ కల్చర్ చాలా ఎక్కువ. అంటే.. ఏండ్ల తరబడి ఒకే రకమైన పంటలు వేస్తుంటారు. ముఖ్యంగా ఖరీఫ్, రబీ సీజన్లలో వరి, గోధుమలు మాత్రమే పండిస్తారు. అలా ఒకేరకమైన పంటలు వేయడం వల్ల భూసారం తగ్గిపోతుంది. అలాంటి టైంలో వచ్చే దిగుబడిలో రైతులకు నష్టాలు తప్పవు. అందుకే వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడానికి, సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్లో వచ్చే నష్టాలను తగ్గించడానికి ప్రిత్‌పాల్ కొత్త దారులు వెతకడం మొదలుపెట్టాడు.
వ్యవసాయం అంటే ఇష్టం
“రైతు కుటుంబం నుండి వచ్చిన నేను నాగ్‌పూర్‌లో చదువుకుని, ముంబైలో ఉద్యోగం చేశా. అయితే సిటీలో ఉద్యోగం చేస్తున్నానే కానీ నా ఆలోచనలు మాత్రం ఊరు, వ్యవసాయం చుట్టూరా తిరిగేవి. అందుకే అవకాశం దొరికితే చాలు పొలానికి వెళ్లేవాడిని. వ్యవసాయాన్ని లాభదాయకమైన వెంచర్‌గా ఎలా మార్చాలి? ప్రకృతి ప్రసాదించిన వనరులను తర్వాతి తరాలకు ఎలా అందించాలి? అనే ఆలోచనలు బుర్రలో గిర్రున తిరుగుతుండేవి. అయితే ఉద్యోగం చేస్తూ వ్యవసాయం చేయడం కుదరదు అనిపించింది. అందుకే జాబ్ మానేసి ఫుల్ టైం రైతుగా మారిపోయా. నా నిర్ణయం గురించి మా అమ్మానాన్నలకు చెప్పినప్పుడు వాళ్లు వద్దన్నారు. కానీ ఆ తర్వాత ఒప్పుకున్నారు” అంటూ తన అడుగులు వ్యవసాయం వైపుకు ఎలా పడ్డాయో చెప్పుకొచ్చాడు ప్రిత్‌పాల్.
మొక్కలు పాతికవేలు
ప్రిత్‌పాల్ రీసెర్చ్ పూర్తిచేశాక హైడ్రోపోనిక్స్ పద్ధతిలో సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. సాధారణంగా భూమి ద్వారా మొక్కలకు సోకే ఫంగల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు ఈ విధానంలో కనిపించవు. ఎలాంటి ప్రయత్నాలు చేసినా మైక్రో ఆర్గానిజమ్స్, నెమటోడ్ల లాంటి పరాన్నజీవులను నేల నుంచి తొలగించలేం. కాబట్టి అసలు మట్టి అవసరమే లేకుండా పంటలు పండించాలి అనుకున్నాడు ప్రిత్‌పాల్. అందుకే హైడ్రోపోనిక్స్ ఫార్మింగ్ చేయాలి అనుకున్నాడు. అంతే వెంటనే తరతరాలుగా వస్తున్న పొలంలో 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 25,000 ఆకుకూర మొక్కలు పెంచాడు.
ముఖ్యంగా పాలకూర, లెట్యూస్‌లను ఎక్కువగా సాగు చేశాడు. అయితే మొదలుపెట్టగానే పూలబాటలా సాగిపోలేదు. మొదట్లో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సవాళ్లను దాటుకుంటూ వస్తేనే అతనికి సక్సెస్ దక్కింది. ఇప్పుడు ప్రతి నెలా దాదాపు800 కిలోల ఆకుకూరలు పండిస్తున్నాడు. అంటే సంప్రదాయ వ్యవసాయంతో పోలిస్తే దిగుబడి ఐదు రెట్లు ఎక్కువగా వచ్చింది. దాంతో.. ప్రిత్‌పాల్ 2016లో ప్రొటెక్టెడ్ కల్టివేషన్ని పూర్తిస్థాయిలో మొదలుపెట్టాడు.
రకరకాల ఆకుకూరలు
సక్సెస్ రావడంతో ప్రిత్‌పాల్ తనకున్న రెండున్నర ఎకరాల భూమిని సాగు చేయడం మొదలుపెట్టాడు. అందులో ఇటాలియన్ తులసి, బేబీ స్పినాచ్, మూడు నుండి నాలుగు రకాల లెట్యూస్, ఎరుపు, పసుపు క్యాప్సికం, కొన్ని రకాల తీగ పంటలు, గింజలులేని కుకుంబర్ లాంటివి పండిస్తున్నాడు. ఈ పంటల కోసం రకరకాల ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్ స్ట్రక్చర్స్ ఏర్పాటు చేశాడు. వాటిలో ఇండోర్ వర్టికల్ ఫామ్, టెంపరేచర్ కంట్రోల్డ్ పాలీహౌస్, నేచురల్లీ – వెంటిలేటెడ్ పాలీహౌస్, ఇండోర్ అండ్ అవుట్‌డోర్ హైడ్రోపోనిక్స్ సెటప్స్ ఉన్నాయి.
ఈ మొత్తం సిస్టమ్స్‌ని ఏర్పాటు చేసేందుకు 60 లక్షల రూపాయలు ఖర్చయ్యాయి. అయితే అదంతా ఒక్కసారి మాత్రమే పెట్టే పెట్టుబడి. ఒకసారి ఏర్పాటు చేసుకుంటే కొన్నేండ్ల వరకు ఉపయోగపడతాయి. ఈ పద్ధతుల్లో ఏడాది పొడవునా టెంపరేచర్ – కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో ఆకు కూరలు పెంచొచ్చు.
నీటి ఆదా
పొలాల్లో చేసే వ్యవసాయంతో పోలిస్తే ఈ పద్ధతిలో 90 శాతం నీటిని ఆదా చేయొచ్చు. ఎందుకంటే.. ఓపెన్ ఫీల్డ్‌తో పోలిస్తే.. ఈ విధానంలో నీటి వృథా చాలా తక్కువ. ఈ విధానంలో మొక్కలకు వేసే పోషకాల ఖర్చు కూడా బాగా తగ్గుతుంది. ఇందులో మొక్కల పెరుగుదలకు ఎంత అవసరమైతే అంతే వేస్తారు. అదే పొలాల్లో అయితే చాలా పెద్ద మొత్తంలో ఎరువులు వేయాల్సి ఉంటుంది.
కుకుంబర్ 90 టన్నులు
ప్రిత్‌పాల్ నేచురల్లీ – వెంటిలేటెడ్ పాలీహౌస్ని ఒకటిన్నర ఎకరాల్లో ఏర్పాటు చేశాడు. అందులో బెల్ పెప్పర్స్, గింజలు లేని కుకుంబర్ పెంచుతున్నాడు. ఏటా 90 టన్నుల కుకుంబర్, 30 టన్నుల బెల్ పెప్పర్ పండిస్తున్నాడు. ఈ సెటప్ ద్వారా నేలతో పోలిస్తే.. 30 శాతం అధిక రాబడి వస్తోంది. మొత్తం మీద సంప్రదాయ పద్ధతులతో పోలిస్తే.. ఈ పద్ధతిలో తన వార్షిక ఆదాయం తీగ పంటల్లో1.5 రెట్లు, ఆకు కూరల్లో ఐదు రెట్లు పెరిగిందని చెప్తున్నాడు ప్రిత్‌పాల్.
సవాళ్లు ఎన్నో..
ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తున్నా.. ప్రిత్పాల్కు ఈ సక్సెస్ ఒక్కరోజులో రాలేదు. గడిచిన ఎనిమిదేండ్లలో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. హైడ్రోపోనిక్స్ టెక్నాలజీ అంతగా లేని టైంలో సరైన సెటప్ ఇన్‌స్టాల్ చేయడం పెద్ద సవాలుగా నిలిచింది. “హైడ్రోపోనిక్స్ ఫామ్ ఏర్పాటు చేసే పనిని ముంబయిలోని ఒక కంపెనీకి అప్పగించా. ఆ కంపెనీకి అందులో తగినంత నాలెడ్జ్ లేదు.
దాంతో ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. పైగా.. సెటప్ సరిగ్గా లేక మొదటి నాలుగు నెలల వరకు మొక్కలు పెంచలేకపోయా. దాంతో ఆ ప్రయత్నం మానేయాలి అనుకున్నా. కానీ.. నా దగ్గర ప్లాన్–బి లేదు. వ్యవసాయం చేయడమే నా లక్ష్యం కావడంతో. మళ్లీ ట్రై చేశా. పొలంలోని ప్రతి పారామీటర్ మీద రీసెర్చ్ చేశా. సెటప్‌లోని ప్రతి మూలను చక్కబెట్టా. ఉదాహరణకు.. కంపెనీ వాళ్లు సరైన ఎల్ఈడీ గ్రో లైట్స్ వాడలేదు.
అవి మొక్కల పెరుగుదలకు కావాల్సిన ఫ్రీక్వెన్సీకి తగినవి కావు. వెంటనే వాటిని మార్చేశా. అలా ఒక్కొక్కటీ మారుస్తూ.. చివరగా పూర్తి సెటప్ రెడీ చేశా. ఆ తర్వాత మెయింటెనెన్స్ ఖర్చులను 80 శాతం తగ్గించడానికి సోలార్ పవర్ ఏర్పాటు చేసుకున్నా. అందుకోసం హైడ్రోపోనిక్స్ సెటప్‌కు సరిపోయే15 KW కెపాసిటీ సోలార్ ప్యానెల్స్ బిగించుకున్నా” అన్నాడు ప్రిత్‌పాల్.
కాపీ.. పేస్ట్.. పనిచేయదు
ఇప్పటికే చాలా దేశాల్లో హైడ్రోపోనిక్స్ విధానంలో పంటలు సాగు చేస్తున్నారు. అయితే.. చాలామంది వాటిని చూసి అలాంటివే మన దేశంలో సెటప్ చేస్తున్నారు. కానీ.. అలా కాపీ, -పేస్ట్ చేస్తే ప్రయోజనం ఉండదు అంటున్నాడు ప్రిత్‌పాల్. ఎందుకంటే.. మనం దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. వాటి ఆధారంగా సెటప్ ఏర్పాటుచేసుకోవాలి. చండీగఢ్‌లో టెంపరేచర్ 20 నుంచి 26 డిగ్రీల మధ్య ఉండేలా చూసుకోవాలి. 60 నుండి 65 శాతం తేమ మెయింటెయిన్ చేయాలి. ఈ పారామీటర్స్ కాశ్మీర్‌లో వేరుగా ఉంటాయి.
దక్షిణ భారతదేశంలో మరోలా ఉంటాయి. కాబట్టి ముందుగానే అన్ని రకాలుగా రీసెర్చ్ చేయాలి. కానీ.. అలా చేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అందుకే.. 2020లో ప్రిత్‌పాల్ హైడ్రోపోనిక్స్ ప్రపంచంలోకి అడుగు పెట్టాలి అనుకునే వాళ్లకు ఎండ్–టు–ఎండ్ సొల్యూషన్స్ అందివ్వాలనే ఉద్దేశంతో ‘ఫార్మ్కల్ట్’ అనే స్టార్టప్ ఏర్పాటుచేశాడు. ఇది రెండు బిజినెస్ మోడల్స్‌లో పనిచేస్తుంది.
కన్సల్టింగ్ కూడా...
ఫార్మ్కల్ట్ ఆధునిక హైడ్రోపోనిక్ ఫామ్స్ డిజైన్ చేస్తుంది. సెటప్ కూడా చేస్తుంది. ఆ ప్రాంతంలో ఉండే వాతావరణం, సాగు చేయాలి అనుకుంటున్న పంటకు తగినట్టుగా సెటప్ చేస్తారు. ఆ తర్వాత కనీసం ఆరు నెలలు రైతులకు సపోర్ట్ సర్వీస్ అందిస్తారు. హైడ్రోపోనిక్స్ వ్యాపారంలోని ప్రతి అంశాన్ని రైతులకు వివరిస్తారు. సాగు చేస్తున్న పంటలకు మార్కెట్ లింక్స్ కూడా ఏర్పాటు చేస్తారు.
భారీ -స్థాయిలో హైడ్రోపోనిక్స్ బిజినెస్ చేయాలి అనుకునే క్లయింట్స్‌కు, పొలాలను మెయింటెన్ చేసే కెపాసిటీ లేనివాళ్లకు ఫార్మ్కల్ట్ సమగ్రంగా మద్దతు ఇస్తుంది. అంటే.. ఫార్మ్‌ని ఏర్పాటు చేయడంతోపాటు విత్తనాలు మొలకెత్తడం దగ్గర నుంచి పంట కోత, మార్కెట్ చేయడం లాంటివన్నీ ఫార్మ్కల్ట్ వాళ్లే చేస్తారు. ఫార్మ్కల్ట్ హైడ్రోపోనిక్ సాగు మీద, దాని ప్రయోజనాల గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో వర్క్‌షాప్స్, ట్రైనింగ్ కూడా ఇస్తుంది. ఇప్పటివరకు ఎంతోమంది ట్రైనింగ్ తీసుకున్నారు కూడా.
ఏమేం పండించొచ్చు?
హైడ్రోపోనిక్ వ్యవసాయం మీద 2023లో చేసిన రీసెర్చ్ ద్వారా ఇది ఆహార ఉత్పత్తిలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తుందని అంచనా వేస్తున్నారు సైంటిస్ట్‌లు. ఈ పద్ధతిలో ఆకు కూరలతోపాటు హెర్బ్స్, టొమాటో, దోసకాయ, స్ట్రాబెర్రీ, రకరకాల పువ్వులు పండించుకోవచ్చు. ఈ పద్ధతిలో నేల అవసరం లేదు. మొక్కలకు వెలుతురుతోపాటు నీళ్లు అందిస్తారు.