ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ షురూ..సెప్టెంబర్ 26నుంచి వెబ్ ఆప్షన్లు

ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ షురూ..సెప్టెంబర్ 26నుంచి వెబ్ ఆప్షన్లు
  • మెరిట్ లిస్ట్‌‌‌‌‌‌‌‌ రిలీజ్ చేసిన కాళోజీ వర్సిటీ
  • గురువారం నుంచి వెబ్‌‌‌‌‌‌‌‌ ఆప్షన్ల నమోదు

హైదరాబాద్, వెలుగు:ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ మొదలైంది. కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న 16,679 మంది విద్యార్థుల వివరాలతో ప్రొవిజినల్ మెరిట్ లిస్టును కాళోజీ హెల్త్ యూనివర్సిటీ మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. ఈ లిస్ట్‌‌‌‌‌‌‌‌పై ఏమైనా అభ్యంతరాలుంటే బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా తమకు తెలపాలని వర్సిటీ వీసీ కరుణాకర్‌‌‌‌రెడ్డి విద్యార్థులకు సూచించారు. 

అభ్యంతరాలను అన్ని ఎవిడెన్స్‌‌‌‌‌‌‌‌తో యూనివర్సిటీ మెయిల్‌‌‌‌‌‌‌కు ((knrugadmission@gmail.com) పంపించాలని ఆయన సూచించారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం గురువారం తుది మెరిట్ లిస్టును విడుదల చేస్తామని ఆయన తెలిపారు. అదే రోజు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు, వెబ్ ఆప్షన్ల నమోదుకు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. 

గతేడాదికి సంబంధించిన కాలేజీల వారి సీట్ల అలా‌‌‌‌‌‌‌‌ట్‌‌‌‌‌‌‌‌మెంట్ వివరాలు యూనివర్సిటీ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆ వివరాలను పరిశీలించి వెబ్ ఆప్షన్ల కోసం ముందే కాలేజీల జాబితాను సిద్ధం చేసుకోవాలని, తద్వారా ఆప్షన్ల నమోదు ప్రక్రియ సులభతరం అవుతుందని విద్యార్థులకు ఆయన సూచించారు.

జీవో 33 ప్రకారమే కౌన్సెలింగ్

స్థానికతకు సంబంధించిన జీవో 33ని సవాల్‌‌‌‌‌‌‌‌ చేస్తూ కొంత మంది విద్యార్థులు కోర్టుకు వెళ్లడంతో ఈ సారి కౌన్సెలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. జీవోను సవాల్ చేసిన పిటిషనర్లలో ఎలిజిబిలిటీ ఉన్నవాళ్లను కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌కు అనుమతిస్తామని, సమయం లేనందున ఈ ఒక్కసారికి జీవో 33 నుంచి పిటిషనర్లకు మినహాయింపునిస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో జీవో 33 ప్రకారమే కౌన్సెలింగ్ నిర్వహించుకునేందుకు అనుమతినిస్తూ, సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. 

తుది తీర్పును మూడు వారాలపాటు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం విడుదల చేసిన మెరిట్ జాబితాలో 132 మంది పిటిషనర్లకు కూడా చోటు కల్పించింది. అందరిలాగే, మెరిట్ ప్రకారమే వీరికి కూడా సీట్లు కేటాయిస్తామని పేర్కొంది. పిటిషనర్లలో 8 మంది దరఖాస్తులను రిజెక్ట్ చేశారు. ఏపీలోని ఎన్‌‌‌‌‌‌‌‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసిన మెరిట్ లిస్టులోనూ వీళ్ల పేర్లు ఉన్నాయని, రెండు రాష్ట్రాల్లో స్థానికులు కాలేరని స్పష్టం చేసింది.