- కన్వీనర్ కోటాలో అడ్మిషన్లకు దరఖాస్తుల స్వీకరణ
- 15 శాతం అన్‌రిజర్వ్‌డ్ కోటాను రద్దు చేసిన సర్కార్
- ఇక కన్వీనర్ కోటాలోని సీట్లన్నీ తెలంగాణ స్టూడెంట్లకే
- రాష్ట్రం నుంచి నీట్ రాసిన స్టూడెంట్ల ర్యాంకులు విడుదల
హైదరాబాద్, వెలుగు: ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ శనివారం షెడ్యూల్ రిలీజ్ చేసింది. రాష్ట్రం నుంచి నీట్ రాసిన విద్యార్థుల ర్యాంకుల జాబితాను కూడా విడుదల చేసింది. ఈ లిస్టులో ఉన్న విద్యార్థులు కన్వీనర్ కోటాలో అడ్మిషన్ల కోసం ఈ నెల 4న ఉదయం 6 గంటల నుంచి 13న సాయంత్రం 6 గంటల వరకూ వర్సిటీ వెబ్‌సైట్‌లో (https://tsmedadm.tsche.in ) దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
విద్యార్హత, స్థానికత, కమ్యునిటీ, తదితర సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేసింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం మెరిట్ లిస్ట్(స్టేట్ ర్యాంక్స్)ను విడుదల చేస్తామని తెలిపింది. ఆ తర్వాత వెబ్ ఆప్షన్లు తీసుకుంటామని, కాలేజీలు, సీట్ల వివరాలను వెబ్‌ఆప్షన్లకు ముందు వెల్లడిస్తామని పేర్కొంది. కౌన్సెలింగ్‌కు సంబంధించి ఏవైనా సందేహాలుంటే 79010 98840, 93926 85856 నంబర్లను సంప్రదించాలని సూచించింది.
ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కలిపి కన్వీనర్ కోటాలో 6,415 సీట్లు ఉన్నాయి. కొత్తగా మరో 4 ప్రభుత్వ, 3 ప్రైవేటు కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. వీటిల్లో మరో 350 సీట్ల వరకూ కన్వీనర్ కోటాలో అందుబాటులోకి వచ్చే చాన్స్ ఉంది.
అన్ని సీట్లు మనోళ్లకే
విభజన చట్టం ప్రకారం.. ఏపీకి, తెలంగాణకు ఉన్న 15 శాతం అన్‌రిజర్వ్‌డ్ కోటాను ప్రభుత్వం రద్దు చేసింది. అడ్మిషన్ నిబంధనల్లో మార్పు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే సీట్ల భర్తీ చేపడుతామని నోటిఫికేషన్‌లో వర్సిటీ పేర్కొంది. జీవో ప్రకారం.. రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 85 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. ఇంకో 15 శాతం సీట్లను ఆల్ ఇండియా కోటాలో భర్తీ చేస్తారు.
ఇక ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో, ఇంకో 50 శాతం సీట్లను మేనేజ్‌మెంట్ కోటాలో భర్తీ చేయనున్నారు. గతంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 15 శాతం సీట్లను ఓపెన్‌లో పెట్టి, వాటిని తెలంగాణ, ఏపీ స్టూడెంట్లలో ఎవరికి మెరిట్ ఉంటే వారికి కేటాయించేవారు. రాష్ట్ర విభజన జరిగి పదేండ్లు కావడంతో ఈ కోటాను(అన్‌రిజర్వ్‌డ్) ప్రభుత్వం రద్దు చేసింది.
నాలుగేండ్లు చదివి ఉండాలి
స్థానికతను గుర్తించే విషయంలోనూ స్వల్ప మార్పులు చేశారు. గతంలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ సెకండ్ ఇయర్ వరకూ 7 ఏండ్లలో 4 ఏండ్లు తెలంగాణలో చదివితే తెలంగాణ విద్యార్థులుగా గుర్తించేవారు. ఈసారి నిబంధనలో మార్పు చేశారు. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ సెకండ్ ఇయర్ వరకూ వరసగా 4 ఏండ్లు తెలంగాణలో చదివినవాళ్లనే స్థానికులుగా గుర్తిస్తామని పేర్కొన్నారు. 9వ తరగతి కంటే ముందు ఎక్కడ చదివారనేదానితో సంబంధం లేదని స్పష్టంచేశారు.
49,184 మంది క్వాలిఫై
తెలంగాణ నుంచి ఈసారి 49,184 మంది నీట్‌లో క్వాలిఫై అయ్యారు. ఆల్ ఇండియా స్థాయిలో 137వ ర్యాంక్ సాధించిన అనురన్ ఘోష్ అనే విద్యార్థికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇతను 9వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకూ తెలంగాణలో చదివి ఉంటే లోకల్ స్టూడెంట్‌గా పరిగణిస్తారు.
ఆల్ ఇండియా కోటాలో 215వ ర్యాంకు సాధించిన పడాల సుహాస్ అనే విద్యార్థికి స్టేట్ సెకండ్ ర్యాంక్, 217వ ర్యాంక్ సాధించిన వేముల స్నేహ స్వర్ణిమ అనే విద్యార్థినీకి స్టేట్ థర్డ్ ర్యాంక్ వచ్చింది. ఈ నెల 13న అప్లికేషన్ల గడువు ముగిసిన తర్వాత ఫైనల్ ర్యాంకుల జాబితా విడుదల కానుంది. 9వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకూ వరసగా నాలుగేండ్లు తెలంగాణలో చదివిన స్టూడెంట్లు మాత్రమే ఫైనల్ లిస్టులో ఉంటారు.