ఇతర కాలేజీల్లోనూ పెరిగిన ఫీజులు
ప్రైవేట్ కళాశాలల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల
భర్తీకి నోటిఫికేషన్ ఫీజుల వివరాల్లేకుండానే జారీ
హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ నేత పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెందిన నీలిమా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ బీ కేటగిరీ సీటు ఫీజు రూ.15 లక్షలుగా, సీ కేటగిరీ సీటు ఫీజు రూ.22.5 లక్షలుగా రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఈ ఫీజులకు సంబంధించిన జీవో(40)ను హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ జూన్‌లోనే విడుదల చేసింది. అనురాగ్ యూనివర్సిటీకి అఫిలియేటెడ్ గా నీలిమా మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ ఈ ఏడాదే పర్మిషన్ ఇచ్చింది. అయితే అపోలో వంటి టాప్ రేటెడ్ కాలేజీలోనే బీ కేటగిరీ సీటు ఫీజు రూ.12.5 లక్షలు ఉండగా, ఓ కొత్త కాలేజీకి రూ.15 లక్షలు ఫీజు నిర్ణయించడంపై హెల్త్ ఆఫీసర్లు, డాక్టర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కాలేజీలో 150 సీట్లు ఉండగా, అన్నింటినీ మేనేజ్‌మెంట్ కోటాలోనే భర్తీ చేసుకునేందుకు కూడా సర్కార్ పర్మిషన్ ఇచ్చింది. ఇతర ప్రైవేటు కాలేజీల్లో 50 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో, 35 శాతం సీట్లను బీ కేటగిరీ కింద, 15 శాతం సీట్లను సీ కేటగిరీ కింద భర్తీ చేస్తున్నారు. కానీ పల్లా కాలేజీలో మాత్రం 85 శాతం సీట్లను బీ కేటగిరీ కింద, 15 శాతం సీట్లను సీ కేటగిరీ కింద భర్తీ చేయనున్నట్టు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది.
మొత్తం 150 సీట్లలో 38 సీట్లను మాత్రమే తెలంగాణ స్టూడెంట్స్‌కు రిజర్వ్ చేశారు. ఇంకో 90 సీట్లకు దేశంలో ఎవరైనా పోటీ పడడానికి అవకాశం కల్పించారు. సీ కేటగిరీ కింద భర్తీ చేసే 15 శాతం సీట్లకు ఎన్‌ఆర్‌ఐలు కూడా పోటీ పడొచ్చు. అంతేకాదు ఈ కాలేజీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మైనార్టీ రిజర్వేషన్లు ఏవీ వర్తించవని పేర్కొన్నారు.
ఈ ఒక్క కాలేజీకే ఇన్ని మినహాయింపులు ఇవ్వడంపై కాళోజీ వర్సిటీ అధికారులను ప్రశ్నించగా.. ‘‘ప్రైవేటు యూనివర్సిటీల చట్టం కింద ప్రభుత్వం మినహాయింపులు కల్పించింది. ఇందులో యూనివర్సిటీ రోల్ ఏమీ ఉండదు. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించడం వరకే మా బాధ్యత’’ అని ఓ ఆఫీసర్ చెప్పారు.
12 వరకు అప్లికేషన్లు..
రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీల్లో ఎంబీబీఎస్ మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఈ నెల 12వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో (tspvtmedadm.tsche.in) దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. నీలిమా మెడికల్ కాలేజీ మినహా మిగిలిన అన్ని ప్రైవేటు కాలేజీల ఫీజులు గత నెల 28న ఆరోగ్యశాఖ విడుదల చేసిన జీవో నంబర్ 106 ప్రకారం ఉంటాయని నోటిఫికేషన్‌లో పేర్కొంది.
నీలిమా కాలేజీ ఫీజు మాత్రం జూన్ 20న హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన జీవో నంబర్ 40 ప్రకారం ఉంటుందని తెలిపింది. జీవో కాపీలను మాత్రం నోటిఫికేషన్‌కు జత చేయలేదు. కనీసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో కూడా ఈ జీవోలను అప్‌లోడ్ చేయలేదు. ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉందో తెలియకుండా, స్టూడెంట్స్ కాలేజీలను ఎలా ఎంపిక చేసుకుంటారని కాళోజీ వర్సిటీ అధికారులను ప్రశ్నిస్తే.. వెబ్ ఆప్షన్ల నమోదుకు ముందు వెల్లడిస్తామని చెబుతున్నారు. పోయినేడాదే ఎంబీబీఎస్ సీట్ల ఫీజులను పెం చిన సర్కార్.. ఇప్పుడు కూడా పెంచడం గమనార్హం. అయితే, ఈ పెంపు మొత్తం కాలేజీల్లో ఉందా? కొన్ని కాలేజీలకే వర్తింపజేశారా? అనేది తెలియాల్సి ఉంది.
ఎంబీబీఎస్ సీట్లతో పాటు మెడికల్ పీజీ, డెంటల్ పీజీ సీట్ల ఫీజులను సర్కార్ సవరించింది. ఈ మేరకు గత నెల 28న జీవోలను (107, 108) విడుదల చేసిందని సెక్రటేరియట్‌లోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ జీవోలను సైతం పబ్లిక్ డొమైన్‌లో పెట్టకపోవడం గమనార్హం.