హయత్ నగర్‎లో MBBS సీట్ల ఘరానా మోసగాడు అరెస్ట్

హయత్ నగర్‎లో MBBS సీట్ల ఘరానా మోసగాడు అరెస్ట్

హైదరాబాద్: ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడుతోన్న ఘరానా మోసగాడిని హయత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. హయత్ నగర్‎కు చెంది చంద్రకాంత్ గౌడ్ (టీంకు భాయ్) MBBS సీట్లు ఇప్పిస్తానని భారీ మొత్తంలో  వసూళ్లకు పాల్పడ్డాడు. రాజకీయ నాయకులు, ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయని.. వారి సహయంతో రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలో సీట్లు ఇప్పిస్తానని డబ్బులు వసూల్ చేశాడు. 

కరీంనగర్‎లోని ఆనంద్ రావు మెడికల్ కాలేజీలో MS(OBG) సీటు ఇప్పిస్తానని ఒకరి దగ్గర కోటి రూపాయిలు తీసుకున్నాడు. సీటు రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు.. రాచకొండ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే మంగళవారం (ఏప్రిల్ 29) పోలీసులు  చంద్రకాంత్‎ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.