ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా ర్యాగింగ్ కు చాలామంది విద్యార్థులు బలవుతున్నారు. విద్యా సంస్థల్లో ర్యాగింగ్ ను అంతం చేయలేక పోతున్నారు. అయితే తాజాగా అమానుష ఘటన బయటకు వచ్చింది. రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్ మెడికల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి సీనియర్ల ర్యాగింగ్ కారణంగా హాస్పిటల్ పాలయ్యాడు. గుజరాత్ నుంచి వచ్చి బాయ్స్ కాంపస్ ఉండి చదువుకుంటున్నాడు. విద్యార్థిని సమీపంలోని కొండపైకి పిలిచారు. 300 పుష్ అప్స్ తీయమని సీనియర్లు బలవంతం చేశారు. ఈ ఘటన మే 15న జరిగింది.. బాధిత జూనియర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఏడుగురు సీనియర్లు కలిసి ఓ కొండ మీదకు జూనియర్ ని పిలిపించారు. జూనియర్ విద్యార్థిని 300 కంటే ఎక్కువ పుష్ అప్స్ చేయమని బలవంతం చేశారని దుంగార్‌పూర్ సదర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ గిర్ధారి సింగ్ తెలిపారు. ఒకేసారి అన్ని పుష్ అప్స్ తీయడం వల్ల విద్యార్థి కిడ్నీపై ప్రభావం పడింది. కిడ్నీపై చాలా ఒత్తిడి పెరిగి, ఇన్ఫెక్షన్ అయి పని చేయకుండా పోయాయి. కొన్ని రోజులు తర్వాత నొప్పి భరించలేక గుజరాత్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అప్పుడే ర్యాగింగ్ గురించి బాధితుని తల్లిదండ్రులకు తెలిసింది. వెంటనే వారు కాలేజీలో ఫిర్యాదు చేసి, పోలీస్ కేసు నమోదు చేశారు. ఇదే ఈ కాలేజీలో కొత్త కాదు.. ఇంతకు ముందు కూడా ఇలాంటి ర్యాగింగ్ కేసులు బయటపడ్డాయి.