ఎంబీబీఎస్​కు బ్రేక్.. ఈజీ మనీకి స్కెచ్​: హనీ ట్రాప్​తో వ్యాపారి కిడ్నాప్

ఎంబీబీఎస్​కు బ్రేక్.. ఈజీ మనీకి స్కెచ్​: హనీ ట్రాప్​తో వ్యాపారి కిడ్నాప్
  • బ్యూటీషియన్​తో ఫోన్​చేయించి బొంగళూరుకు రప్పించిండు 
  • ఎస్సై​వేషంలో 21న అపహరణ
  • ముఖానికి మాస్క్​ వేసి గన్ ​పెట్టి రూ.3 కోట్ల డిమాండ్​
  • బాండ్​పేపర్లపై సంతకాలు తీసుకుని రిలీజ్​ 

ఇబ్రహీంపట్నం, వెలుగు: ఎంబీబీఎస్ మధ్యలో వదిలేసి ఖరీదైన జీవనశైలికి అలవాటుపడి ఓ యువకుడు ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కాడు. ఓ మహిళతో వ్యాపారిని హనీ ట్రాప్​చేయించి కిడ్నాప్​చేశాడు. పోలీస్​డ్రెస్​వేసుకుని తలపై గన్​పెట్టి బెదిరించాడు. అమ్మాయిలతో దిగిన ఫొటోలు, ఫోన్​కాల్స్​రికార్డ్స్​తన దగ్గర ఉన్నాయని, వాటిని బయట పెడతానంటూ రూ. 3 కోట్లు డిమాండ్​చేశాడు. అంత డబ్బు తన దగ్గర లేదని చెప్పడంతో బాండ్​పేపర్లపై డబ్బులు ఇచ్చేది ఉందంటూ సంతకాలు తీసుకుని వదిలిపెట్టాడు.  సదరు వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు నిందితులను అరెస్ట్​చేసి రిమాండ్ కు తరలించారు.

కేసు వివరాలను ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లో శుక్రవారం మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డి వెల్లడించారు. కొరివి ధనరాజ్ అలియాస్ అర్జున్ స్వగ్రామం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కాగా, హయత్ నగర్ మండలం వైదేహి నగర్ లో ఉంటున్నాడు. ఎంబీబీఎస్​చదువును మధ్యలో ఆపేసి కొద్ది రోజులు ఇబ్రహీంపట్నంలోనే క్లినిక్ నడిపాడు. తర్వాత రియల్ ఎస్టేట్​వ్యాపారం అంటూ కుటుంబ ఆస్తులను అన్నీ అమ్ముకున్నాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు. ఈజీగా డబ్బులు సంపాదించాలానే దురాశతో ఓ ప్లాన్​వేశాడు.

స్పాలో పరిచయమైన మౌలాలికి చెందిన బ్యూటీషియన్ మక్కల భవానితో ఇబ్రహీంపట్నానికి చెందిన బట్టల వ్యాపారి రచ్చ నారాయణకు ఫోన్ చేయించాడు. దీని కోసం ఆమెకు రూ.30 వేలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ప్లాన్​లో భాగంగా ఆమె అతడితో మాటలు కలిపి పరిచయం పెంచుకుంది. బొంగళూరు వద్ద ఉన్న మెట్రో సిటీ వెంచర్​లో ప్లాట్స్ ఉన్నాయని, విజిట్​చేయడానికి రావాలని కోరింది. 

ఫోన్ ​కాల్స్​ ఆధారంగా..

దీంతో ఈ నెల 21న నారాయణ, అతడి డ్రైవర్ ముజీబ్ అక్కడికి వచ్చారు. అంతకుముందే అర్జున్​ఆన్ లైన్ లో పోలీస్​డ్రెస్, డమ్మీ పిస్టల్​కొని ఎస్​ఐ వేషంలో రెడీగా ఉన్నాడు. వైదేహినగర్ కు చెందిన శివకుమార్, కర్ణంగూడాకు చెందిన డేరంగుల శ్రీకాంత్, అనాజ్ పూర్ కు చెందిన సుర్వీ శేఖర్ ..అతడికి గన్​మెన్లుగా నటించారు. వీరంతా కలిసి నారాయణను కిడ్నాప్​చేసి ముఖానికి మాస్క్​వేశారు. కారులో ఎక్కించుకుని చుట్టుపక్కల ప్రాంతాల్లో తిప్పారు. పాయింట్​బ్లాంక్​రేంజ్​లో గన్​పెట్టిన అర్జున్​‘ నువ్వు అమ్మాయిలతో ఉన్న ఫొటోలు, మాట్లాడిన కాల్​రికార్డ్స్​నా దగ్గర ఉన్నాయ్.

అవి నీ కుటుంబసభ్యులకు పంపుతా. విషయం నా దగ్గర ఆగిపోయేట్టు చేస్తా. కాబట్టి రూ.3 కోట్లు ఇవ్వు. లేకపోతే ఈ విషయం కమిషనర్​దాకా పోతుంది’ అని బెదిరించాడు. అంత డబ్బు తన దగ్గర లేదని చెప్పగా, కనీసం రూ. కోటి అయినా ఇవ్వాలని అడిగాడు. అవి కూడా లేవనడంతో బాండ్​పేపర్ పై రూ.20 లక్షలు రెండు రోజుల్లో ఇస్తానని రాయించుకుని సంతకాలు తీసుకున్నాడు. తర్వాత ఔటర్ సమీపంలో వదిలేసి వెళ్లిపోయారు.

దీంతో నారాయణ 23న ఆదిబట్ల పీఎస్​లో ఫిర్యాదు చేశాడు. ఫోన్​కాల్స్, కారు నంబర్​తదితర ఆధారాలు సేకరించిన పోలీసులు నిందితులను అరెస్ట్​చేశారు. కారు, డమ్మి పిస్టల్​, పోలీస్ డ్రెస్, కత్తి, ఏడు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, ఆదిబట్ల  సీఐ రాఘవేందర్ రెడ్డి ఉన్నారు.