ఎత్తిపోతలకు లైన్​ క్లియర్​ ! ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ నిర్మాణానికి ముందడుగు

  • రైతులను ఒప్పించి భూసేకరణకు సిద్ధం
  • నాలుగేండ్లుగా ఎంబీసీ లిఫ్ట్ పనులు నత్తనడకన
  • ఏడాదిలో వడివడిగా అడుగులు

మేళ్లచెరువు, వెలుగు : సూర్యాపేట జిల్లాలోని భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. చింతలపాలెం మండలంలో ముక్త్యాల బ్రాంచ్ కెనాల్(ఎంబీసీ) ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం భావించింది.ఈ మేరకు పంప్ హౌజ్ ప్రతిపాదిత స్థలాన్ని గుర్తించింది. 

కానీ భూములు కోల్పోయే రైతులకు పరిహారం ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాయక.. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి పదవి చేపట్టడంతో లిఫ్ట్ పనుల్లో కదలిక మొదలైంది. మంత్రి ప్రత్యేక చొరవతో బాధిత రైతులకు భారీ నష్టపరిహారానికి ఒప్పందం కుదిరింది. దీంతో ఎత్తిపోతల పనులకు మార్గం సుగమమైంది.

50 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ..

హుజూర్‌‌‌‌నగర్ నియోజకవర్గంలో ఇప్పటికే చిన్న, పెద్ద లిఫ్ట్ స్కీంలు చాలానే ఉన్నాయి. వీటి నిర్వహణ కష్టతరంగా మారడం, సాంకేతిక సమస్యలు తలెత్తడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాత వెల్లటూరు వద్ద ఎంబీసీ ఎత్తిపోతలను పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ లిఫ్ట్ పూర్తయితే ఐదు మండలాల్లోని 50 వేల ఎకరాల
 ఆయకట్టు స్థిరీకరణ కానున్నది.

లిఫ్ట్ రూపురేఖలివి..

వెల్లటూరు వద్ద ఉన్న కృష్ణానది జలాలను సేకరించి ఎంబీసీ ద్వారా 20 కిలో మీటర్ల దూరంలోని వేపలసింగారం వద్ద మేజర్ కెనాల్ లో కృష్ణా జలాలను చేరవేయడం.. దీని ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం 68.28 ఎకరాలను పంప్ హౌజ్ నిర్మాణం కోసం భూమి సేకరించారు. రైతులకు పరిహారం కూడా ప్రకటించారు. ఆరు నెలలుగా జరిపిన చర్చలతో పరిహారాన్ని  రూ.20.25 లక్షలుగా నిర్ణయించి ఇటీవలే రైతులను ఒప్పించారు. 

పైప్ లైన్ భూముల సేకరణే మిగిలింది..

లిఫ్ట్ స్కీం ద్వారా జలాలను తరలించేందుకు ఏర్పాటు చేసే పైప్ లైన్ కోసం 20 కిలోమీటర్ల మేర మార్కింగ్ చేశారు. అయితే తమ భూముల ద్వారా పైప్ లైన్ వేయడానికి వీలులేదని చింతలపాలెం, మేళ్లచెరువు, హుజూర్‌‌‌‌నగర్ మండలాల్లోని సుమారు 100 మంది రైతులు ఆందోళనకు దిగారు. పైప్ లైన్ కోసం 60 అడుగుల మేర స్థలసేకరణ చేస్తున్నారని, పైప్ లైన్ కోసం అంత భూమి అవసరం లేదని రైతులు భావిస్తున్నారు. వీళ్ల సమస్యను పరిష్కరిస్తే పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. 

ALSO READ : యాసంగి సాగుకు సరిపడా నీరు.. ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో కళకళలాడుతున్న రిజర్వాయర్లు

మా భూమిని మొత్తం ఇచ్చినం..

పంప్ హౌజ్ పైభాగాన మా అన్నదమ్ముల పేరున ఉన్న భూమిని మొత్తం ఇచ్చినం. మంత్రి ఉత్తమ్ కుమార్​రెడ్డి హామీతో భూములకు మంచి పరిహారం ఇస్తామని ఆఫీసర్లు చెప్పడంతో భూములు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ‌‌‌‌- కన్నా సాంబశివరావ, మేళ్లచెరువు