కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఎన్నో ఆశలు చూపిన పాలకులు రాజకీయాలే ప్రధాన ఎజెండాగా పాలన సాగిస్తున్నారు. బంగారు తెలంగాణ సాధించుకుందామని, అందరికీ సమ న్యాయం దొరుకుతుందని అనేక సమావేశాల్లో సీఎం కేసీఆర్ వాగ్దానాలు చేశారు. కానీ ఏడేండ్ల టీఆర్ఎస్ పాలనలో పీడిత వర్గాలకు ఒరిగిందేమీ లేదు. అత్యంత వెనుకబడిన వర్గాలు(ఎంబీసీ)ల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. బడ్జెట్లో ఏటా కోట్ల రూపాయలు పెడుతున్నా.. అందులో పావలా వంతు కూడా ఖర్చు చేయడం లేదు. టీఆర్ఎస్సర్కారు ఇప్పటికైనా ఎంబీసీల సంక్షేమం గురించి ఆలోచించాలి.
రాష్ట్రంలో బీసీలు అత్యంత వెనకబడ్డారు. గత ప్రభుత్వాలతో పాటు టీఆర్ఎస్ సర్కారు వారి అభివృద్ధిని పట్టించుకో లేదు. బీసీల్లో అత్యంత వెనకబడిన(ఎంబీసీ) కులాలు ఉన్నాయి. బీసీ జనాభాలో 38% ఎంబీసీలు ఉంటారు. కులాలుగా చూస్తే ఎంబీసీల సంఖ్య తక్కువ గనుక వీరికి రాజకీయ ప్రాతినిధ్యం ఉండటం లేదు. రాజకీయంగా ఎంబీసీలకు ఏండ్లుగా అన్యాయం జరుగుతోంది. కొన్ని సంచార జాతుల జనాలు అసలు గ్రామ పంచాయతీ మెట్లు కూడా ఎక్క లేదనేది నిజం.
పథకాలు అందుతలేదు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎంబీసీలకు అందడం లేదు. టీఆర్ఎస్ ఎంబీసీలకు వెయ్యి కోట్లు కేటాయించినట్లు చెబుతున్నా.. వారి పరిస్థితి మారలేదు. బీసీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో కల్పిస్తున్న రిజర్వేషన్లు దక్కడం లేదు. గత పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కనిపించిన ఎంబీసీలకు దక్కిన పదవులు ఒక శాతం లోపే. బీసీల్లో 8 నుంచి10 శాతం దాకా ఉన్న ఆధిపత్య కులాలు ప్రభుత్వ పథకాలు, రిజర్వేషన్లు దక్కించుకుంటూ పైకి ఎదుగుతున్నాయి. అత్యంత వెనకబడిన వర్గాలు అలాగే ఉంటున్నాయి. 1952 నుంచి 2018 వరకు జరిగిన ఎన్నికల్లో పార్లమెంటు, అసెంబ్లీ గడప తొక్కని ఎంబీసీ కులాలు 100కు పైగా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్34 ప్రకారం రాష్ట్రపతి నియమించిన ఓబీసీ కమిషన్ సిఫార్సు ద్వారా వెనకబడిన తరగతులకు రిజర్వేషన్లను అమలు చేయవచ్చు. ఇందులో భాగంగానే ఓబీసీ స్థితిగతులపై కేంద్ర ప్రభుత్వం1953 జనవరి 29న కాకా కాలేల్కర్నేతృత్వంలో జాతీయ బీసీ కమిషన్‌ను నియమించింది. 1955లో కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కేంద్ర ప్రభుత్వం ఆ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టింది. దాదాపు 2,399 బీసీ కులాలు ఉండగా అందులో 837 ఎంబీసీ కులాలు ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. 1978లో మురార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు బీపీ మండల్ ఆధ్వర్యంలో రెండో జాతీయ ఓబీసీ కమిషన్ ఏర్పాటైంది. 1980లో మండల్ కమిషన్ బీసీలను గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి పేరుతో మూడు గ్రూపులుగా విభజించవచ్చని సిఫార్సు చేసింది. 1990లో ఓబీసీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో 27 శాతం రిజర్వేషన్లు కల్పించారు.
ఉమ్మడి రాష్ట్రంలో..
ఉమ్మడి ఏపీలో అనంతరామన్ కమిషన్, మురళీధరరావు కమిషన్, సుబ్రహ్మణ్యం కమిషన్లు ఏర్పాటయ్యాయి. ఇవి ఎంబీసీలకు న్యాయం చేయలేదు. 2014 ఎన్నికల ముందు టీఆర్ఎస్ సంచారజాతులకు న్యాయం చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నా.. ఆ తర్వాత పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం నాలుగేండ్ల క్రితం ఎంబీసీ కమిషన్ ఏర్పాటు చేసింది. దీనికి 4 వేల కోట్లు కేటాయించినా 200 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ఎంబీసీ జాబితాలో ఉన్న కొన్ని కులాల ఫెడరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. అత్యంత వెనకబడిన కులాల ప్రతినిధులతో 2015లో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ ఏటా బడ్జెట్ లో వెయ్యి కోట్లను ప్రత్యేకంగా కేటాయిస్తామని చెప్పారు. తరువాత నాలుగు సార్లు హడావుడిగా సమావేశం ఏర్పాటు చేశారు. ఎంబీసీ కులాల ప్రతినిధుల ఇక తమకు మంచి రోజులు వస్తాయనుకున్నా అలా జరగలేదు. సంక్షేమం విషయం అటుంచితే ఎంబీసీ కార్పొరేషన్ కార్యాలయానికి దిక్కు లేకుండా పోయింది. మొదటి చైర్మన్‌గా తాడూరి శ్రీనివాస్‌ను నియమించి చేతులు దులుపుకున్నారు. కనీసం ఎంబీసీ నాయకులకు సీఎం అపాయింట్మెంట్దొరక్కపోవడంతో నాలుగేళ్ల నుంచి ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 2017-–18 బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించారు. 2017 స్వాతంత్ర్య వేడుకల్లో 50 మందికి రూ.50 వేల చొప్పున వ్యక్తిగత రుణాలు ఇచ్చారు. అంతకు మించి ఏమీ జరగలేదు. 2018లో కేటాయించిన వెయ్యి కోట్లలో మొదటి ఏడాది ఆరు కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ నాలుగేండ్లలో నాలుగు వేల కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ ఖర్చు చేసింది మాత్రం 200 కోట్ల లోపే. ఈ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన కులాలు దాదాపు వందకు పైగా ఉండగా అందులో చాలా కులాలను ఫెడరేషన్ల పేరిట వేరు చేశారు. బీసీ ఫెడరేషన్ లో ఉన్న కులాలను బీసీ కార్పొరేషన్ నుంచి మినహాయించారు. ఎంబీసీల పరిస్థితి ఏ మాత్రం మారడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఎంబీసీలకు పాలనలో భాగస్వామ్యం కల్పించి వారి జీవన స్థితిగతులను మెరుగుపరచాలి.
సెంట్రల్ స్కీములతో కూడా..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఒకటి. ఈ స్కీం ముఖ్య ఉద్దేశం 2022 నాటికి దేశంలో ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడం. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల ఇంటి నిర్మాణానికి అయ్యే వ్యయంలో 75 శాతం కేంద్ర ప్రభుత్వం, 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. అయితే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా, తెలంగాణ గృహ నిర్మాణ విధానం ద్వారా కానీ ఇప్పటివరకు ఏ ఒక్క గ్రామానికి ఇండ్లు మంజూరు కాలేదు. 20 వేల కోట్ల రూపాయలతో ప్రారంభించిన ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం కూడా అర్హులకు చేరడం లేదు. స్వయం సహాయక బృందాలు చిన్న చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి పొందే వారికి 50 వేల నుంచి 10 లక్షల వరకు బ్యాంకు ద్వారా రుణ సదుపాయం కల్పించాలి. అయితే పేద, మధ్య తరగతి కుటుంబాల వారికి బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయడం లేదు.
- మన్నారం నాగరాజు, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ లోక్‌సత్తా పార్టీ