
నిర్మల్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేసే అభ్యర్థులంతా నిర్మల్ మీదుగా రైల్వేలైన్ ఏర్పాటుచేస్తామని ముందుగా బాండ్ పేపర్ రాసిచ్చి, గెలిచిన తర్వాత రైల్వే లైన్ తీసుకురావాలని నిర్మల్ రైల్వేలైన్ సాధన సమితి చైర్మన్, పెన్షనర్స్ సంఘం జాతీయ కార్యదర్శి ఎంసీ లింగన్న డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలోని పెన్షనర్స్ భవన్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. గత పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పసుపు బోర్డు తీసుకువస్తానని చెప్పి బాండ్ పేపర్ రాసిచ్చి పోటీచేశారని చెప్పారు.
ఇప్పుడు ఆదిలాబాద్ ఎంపీగా పోటీచేసే అభ్యర్థులెవరైనా ఆరూర్మ్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వరకు రైల్వేలైన్ ఏర్పాటుకు కృషిచేస్తామని ముందుగా బాండ్ పేపర్ రాసివ్వాలని డిమాండ్ చేశారు. ఇందుకు అన్నిపార్టీలు, సంఘాలు కలిసిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పెన్షనర్స్ సంఘం సెక్టార్ అధ్యక్షుడు విలాస్, టీఎన్జీఓస్ అధ్యక్షుడు వెల్మల ప్రభాకర్, నిర్మల్ రైల్వే సాధన సమితి బాధ్యులు సాయన్న, మూర్తి ప్రభాకర్, గణేశ్, సభ్యులు పాల్గొన్నారు.