- బీజేపీ అభ్యర్థి కిషన్పాల్పై 3 ఓట్ల తేడాతో గెలుపు
- ఢిల్లీకి తొలి దళిత మేయర్‌గా రికార్డు
న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కొత్త మేయర్‌గా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి చెందిన కౌన్సిలర్ మహేశ్ ఖించీ ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థిపై 3 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ సభ్యుల వాకౌట్ మధ్య గందరగోళ పరిస్థితుల్లో గురువారం సాయంత్రం ఢిల్లీ మేయర్ ఎన్నిక జరిగింది. ఆప్‌కు చెందిన మహేశ్ ఖించీకి 133 ఓట్లు రాగా, బీజేపీకి చెందిన కిషన్‌పాల్‌కు 130 ఓట్లు వచ్చాయి. దీంతో ఢిల్లీ తొలి దళిత మేయర్‌గా మహేశ్ ఖించీ రికార్డు సాధించారు. అయితే ఖించీ పదవీకాలం మరో 5 నెలలు మాత్రమే ఉంటుంది.
సభలో బీజేపీకి 120 మంది సభ్యులే ఉన్నా.. మరో 10 ఓట్లు ఎక్కువగా రావడం గమనార్హం. కాగా, ఏప్రిల్‌లో నిర్వహించాల్సినఈఈ ఎన్నికలు ఆప్, బీజేపీ మధ్య పోరుతో వాయిదా పడుతూనే వస్తున్నాయి. తాజాగా, దళిత మేయర్‌కు ఏడాది పదవీ కాలం ఉండాలంటూ కాంగ్రెస్ వాకౌట్ చేసింది. ముస్తఫాబాద్ వార్డు కౌన్సిలర్, కాంగ్రెస్‌కు చెందిన మహ్మద్ ఖుష్నూద్ భార్య సబిలా బేగం ఆప్ అభ్యర్థికి ఓటు వేస్తామని చెప్పి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఓటింగ్ ప్రారంభం కాగానే ఏడుగురు కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేయగా, ఆమె ఓటు వేయలేదు. పార్టీ వాకౌట్ నిర్ణయంపై ఆమె మాట్లాడుతూ.. పార్టీ వాకౌట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రిజైన్ చేశారు. పార్టీ నిర్ణయం బీజేపీకి మాత్రమే మేలు చేస్తుందని సబిలా బేగం తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.