
హైదరాబాద్, వెలుగు: ఫాస్ట్ ఫుడ్ చెయిన్ మెక్‌డొనాల్డ్స్ హైదరాబాద్‌లో గ్లోబల్ ఆఫీస్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. మొదటి దశలో 2 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. ఇతర రాష్ట్రాలు పోటీ పడినా మెక్‌డొనాల్డ్స్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) హైదరాబాద్‌కు రావడంపై రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం తెచ్చిన పాలసీలు, ఇక్కడి వ్యాపార వాతావరణం మెక్‌డొనాల్డ్స్‌ను ఆకర్షించాయని తెలిపారు. తాము తీసుకొచ్చిన స్కిల్ యూనివర్సిటీ నుంచి మెక్‌డొనాల్డ్స్ లాభపడుతుందని, కేవలం గ్లోబల్ ఆఫీస్ కోసమే కాకుండా దేశంలోని కంపెనీ రెస్టారెంట్ ఆపరేషన్స్‌కు కూడా స్కిల్స్ ఉన్నవారిని నియమించుకోగలుగుతుందని రేవంత్ రెడ్డి అన్నారు.
మెక్‌డొనాల్డ్స్‌కు అవసరమయ్యే వ్యవసాయ ఉత్పత్తులన్నీ లోకల్ రైతుల నుంచే సేకరించాలని కోరారు. ట్యాలెంట్ ఉన్న ఉద్యోగులు అందుబాటులో ఉండడం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాగుండడం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెరుగ్గా ఉండడంతో బెంగళూరు వంటి ఇతర సిటీలకు బదులు హైదరాబాద్‌ను ఎంచుకున్నామని మెక్‌డొనాల్డ్స్ చైర్మన్ క్రిష్ కెంపజిన్స్కీ వివరించారు. ‘మెక్‌డొనాల్డ్స్ చైర్మన్ క్రిష్, గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ ప్రెసిడెంట్ స్కై ఆండర్సన్, చీఫ్ గ్లోబల్ ఇంపాక్ట్ ఆఫీసర్ జాన్ బానర్, జీబీఎస్ ఇండియా హెడ్ దేశంత్ కైలా, రాష్ట్ర ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఇరువురి మధ్య ఒప్పందం కుదిరింది’ అని సీఎంఓ ప్రకటించింది.