ఆస్ట్రేలియా- భారత్ జట్ల మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి మరో రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఇప్పటి నుంచే ఈ సిరీస్ కు క్రేజ్ ఆకాశాన్ని దాటేస్తుంది. రెండు జట్లు టెస్ట్ క్రికెట్ లో అసలైన మజాను చూపిస్తాయి. అగ్ర జట్లు.. స్టార్ ఆటగాళ్లు.. స్టేడియం నిండా ప్రేక్షకులు.. వెరసి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆసక్తికరంగా మారుస్తాయి. మరోసారి ఈ మెగా సిరీస్ అభిమానులకు కిక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దానికి తగ్గట్టుగానే ఈ మెగా సిరీస్ లోని ఒక మ్యాచ్ కు భారీగా టికెట్ ధరలను పెంచేశారు.
మెల్ బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి 30 వరకు నాలుగో టెస్ట్ జరుగుతుంది. ఈ టెస్టుకు టికెట్ల రేట్లు సాధారణ ధర కంటే మూడు రేట్లు పెంచారు. ఈ స్టేడియం కెపాసిటీ మొత్తం 90000. బాక్సింగ్ డే టెస్ట్ ప్రతిసారి మెల్ బోర్న్ వేదికగా జరుగుతుంది. ఈ టెస్ట్ చూడడానికి ప్రేక్షకులు భారీగా తరలి వస్తారు. ఈ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని టికెట్ రేట్స్ భారీగా పెంచినట్టు తెలుస్తుంది.
సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ నవంబర్ 22న పెర్త్ లో జరుగుతుంది. డిసెంబర్ 6 నుంచి 10 వరకు అడిలైడ్ వేదికగా రెండో టెస్టు డే నైట్ జరుగుతుంది. డిసెంబర్ 14 నుంచి 18 వరకు గబ్బాలో మూడో టెస్ట్.. డిసెంబర్ 26 నుంచి 30 వరకు ఎప్పటిలాగే నాలుగో టెస్ట్ బాక్సింగ్ డే రోజున ప్రారంభమవుతుంది.మెల్బోర్న్ లో ఈ టెస్ట్ జరుగుతుంది. చివరిదైన ఐదో టెస్ట్ జనవరి 3 నుంచి 7 వరకు సిడ్నీ వేదికగా జరుగుతుంది.
ALSO READ | Irani Cup 2024: కెప్టెన్‌గా గైక్వాడ్.. రెస్టాఫ్ ఇండియా జట్టు ప్రకటన
ఆస్ట్రేలియా గడ్డపై చివరగా జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను భారత జట్టు గెలుచుకుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ 72 ఏళ్లలో తొలిసారి 2-1 తేడాతో ఆసీస్ గడ్డపై సిరీస్ గెలిస్తే.. 2020-21లో తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే సారధ్యంలో 2-1 తేడాతో సిరీస్ గెలుచుకుంది. చివరిసారిగా 2023 లో నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 2-1 తేడాతో గెలుచుకోవడం విశేషం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2025 సైకిల్ లో భాగంగా ఈ సిరీస్ ఇరు జట్లకు కీలకంగా మారనుంది.