కోల్‌బెల్ట్, వెలుగు: ఏఐటీయూసీ డిమాండ్‌తోనే సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకు వయోపరిమితి 35 నుంచి 40 ఏండ్లకు పెంచేందుకు సింగరేణి యాజమాన్యం ఆంగీకరించిందని ఆ సంఘం కేంద్ర కమిటీ సెక్రటరీ ఎండీ అక్బర్అలీ అన్నారు. మంగళవారం మందమర్రి ఏరియా ఆర్కేపీ సింగరేణి సీహెచ్‌పీ, కేకే ఓసీపీల్లో వేర్వేరుగా జరిగిన గేట్ మీటింగుల్లో ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీలు ఎ.ఆంజనేయులు, సలెంద్ర సత్యనారాయణతో కలిసి మాట్లాడారు.
యూనియన్ గౌరవ అధ్యక్షుడు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, స్టేట్ ప్రెసిడెంట్వాసిరెడ్డి సీతారామయ్య, జనరల్ సెక్రెటరీ రాజ్ కుమార్ సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి డిపెండెంట్ల వయసును 35 నుంచి 40 ఏండ్లకు పెంచేలా కృషి చేశారన్నారు. రిటైర్ కార్మికుల కోసం సీపీఆర్ ఎంఎస్ కార్డు ద్వారా రూ.8 లక్షల పరిమితికి మించి ఖర్చు చేసేలా యాజమాన్యంతో మాట్లాడి ఒప్పించినట్లు చెప్పారు. సమావేశాల్లో బ్రాంచి వైస్ ప్రెసిడెంట్లు లింగయ్య, సుదర్శనం, సీహెచ్‌పీ, కేకే ఓసీపీ, కేకే-5 గని పిట్ సెక్రటరీలు హరి రామకృష్ణ, రాజేశ్ యాదవ్, పలువురు లీడర్లు పాల్గొన్నారు.
డిపెండెంట్ల ఏజ్ పెంపు ఘనత ఐఎన్టీయూసీదే
సింగరేణి కార్మికుల హక్కులు, డిమాండ్ల సాధన కాంగ్రెస్ సర్కార్, ఐఎన్టీయూసీతోనే సాధ్యమని ఐఎన్టీయూసీ రీజియన్ ఇన్చార్జి కాంపెల్లి సమ్మయ్య అన్నారు. మందమర్రిలోని యూనియన్ఆఫీస్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్, బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసిందని, డిపెండెంట్ల ఏజ్40 ఏళ్ల పెంపుకు అప్పటి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో హామీ ఇచ్చి మరిచిపోయారని దయ్యబట్టారు.
ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ నేతృత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వినోద్‌ను ఒప్పించి డిపెండెంట్ఉద్యోగాల ఏజ్ పరిమితిని 40 ఏండ్లకు పెంచిన ఘనత ఐఎన్టీయూసీకే దక్కుతుందన్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ యాజమాన్యానికి తొత్తుగా మారిందని ఆరోపించారు. ఐఎన్టీయూసీ బ్రాంచి వైస్ ప్రెసిడెంట్దేవి భూమయ్య, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్, యూనియన్ ఏరియా సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.