హైదరాబాద్, వెలుగు: వానాకాలం లోపు ఇంకుడు గుంతలు నిర్మించుకుంటే భూగర్భ జలాలను పెంచుకోవచ్చని వాటర్‌బోర్డు ఎండీ సుదర్శన్‌రెడ్డి సూచించారు. గురువారం ఆయన బోర్డు హెడ్డాఫీసులో ఇంకుడు గుంతల నిర్మాణం, సర్వేపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వాటర్ ట్యాంకర్ల డిమాండ్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో సర్వే చేస్తున్నామని, ఆయాచోట్ల ఇంకుడు గుంతల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని సుదర్శన్‌రెడ్డి తెలిపారు.
భూగర్భ జలాలు పడిపోవడంతో ఈసారి 30 వేల కుటుంబాలకు పైగా అధికంగా వాటర్ ట్యాంకర్లు బుక్ చేసుకున్నాయని చెప్పారు. వచ్చే ఏడాదిఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా 18 స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇంకుడు గుంతల సర్వే చేపట్టినట్లు వెల్లడించారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఇప్పటివరకు 2,500 కుటుంబాలను కలిసి వివరాలు సేకరించారన్నారు. సమావేశంలో రెవెన్యూ డెరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, ఇంకుడు గుంతల ప్రత్యేకాధికారి జాల సత్యనారాయణ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.